సుధీర్ రెడ్డి, ఎన్సీవీ నాయుడు తగాదా.. బాబు సమక్షంలోనే..

Kalahasthi Naidu And Sudheer Reddy Fights In The Presence of Chandra Babu In Kuppam - Sakshi

తిరుపతి:ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది కాళహస్తి నాయుడు స్థితి. ఉన్నచోట ఉండకుండా అటు ఇటు వెళ్లి..ఇప్పడు ఎటూ కాకుండా పోయారు పాపం. టీడీపీలో ఉంటూ వైఎస్సార్సీపీలోకి వచ్చిన నాయుడు ఇప్పుడు అక్కడ ఇమడలేక టీడీపీలోకి మళ్లీ వద్దాం అని చూస్తున్నారు. అంతా అనుకున్నట్లు సాగితే ఈరోజే అయన టీడీపీలోకి మళ్లీ వచ్చి చేరేవారు కానీ అక్కడి టీడీపీ ఇంఛార్జ్ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి మోకాలు అడ్డం వేయడంతో పాపం నాయుడు గారు టీడీపీలోకి రాలేక, వైసీపీలో ఇమడలేక చాలా అవస్థలు పడుతున్నారు. 

గుర్తింపు రాకపోయేసరికి..
వాస్తవానికి  ఎస్సీవీ నాయుడు  2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి  ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన టీడీపీలోకి చేరారు. అయినా సీటు ఇవ్వకపోవడంతో ఊరుకుని, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కానీ ఇన్నాళ్లున్నా ఆయనకు పార్టీలో ఎలాంటి గుర్తింపు రాకపోయేసరికి మళ్లీ టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇష్టపడని సుధీర్‌ రెడ్డి..
ఈమేరకు గురువారమే టీడీపీలో చేరేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు అనుమతులు, ఎపాయింట్మెంట్ సైతం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే తన క్యాడర్ కు సైతం సమాచారం అందించి మళ్లీ తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు చెప్పేసారు. అయితే ఇంఛార్జీని తానూ ఉండగా తనకు కనీసం చెప్పకుండా, తన అంగీకారం లేకుండా నాయుడు మళ్లీ టీడీపీలో చేరడాన్ని ఇష్టపడని సుధీర్ రెడ్డి తన పవర్ చూపించారు. నియోజకవర్గ ఇంఛార్జీని అయిన తనకు చెప్పకుండా ఎస్సీవీ నాయుడును పార్టీలో ఎలా చేర్చుకుంటారని సుధీర్ రెడ్డి నేరుగా అధిష్ఠానాన్ని ప్రశ్నించడమే కాకుండా ఒక వాయిస్ మెసేజ్ కూడా విడుదల చేసారు. కార్యకర్తలు ఎవరూ పోవద్దని సుధీర్ రెడ్డి వాయిస్ మెసేజ్  కార్యకర్తలతోబాటు అధిష్టానానికి చేరింది.

ఈతకాయ తెచ్చుకుని తాటికాయ వదిలేసుకోవడం ఎందుకని భయపడిన చంద్రబాబు, అధిష్ఠానం ఎన్సీవీ నాయుడు చేరికను తాత్కాలిక వాయిదా వేసింది. కుప్పంలో తేల్చుకుందాం రమ్మని చంద్రబాబు కబురంపడంతో ఇరువర్గాలు తమ బలాబలాలు తేల్చడానికి సిద్ధమయ్యాయి. రెండువర్గాల నేతలు..కార్యకర్తలు బరిలోకి దూకడానికి రెడీగా ఉన్నారు.దీంతో  బొజ్జల సుధీర్ రెడ్డితోపాటు ఎన్సీవీ నాయుడు గ్రూపు తమ బలాబలాలు అక్కడ తెల్చుకోనున్నాయి.

ఇదీ చదవండి:బాబు.. దేవుడితో పరాచకాడితే ఇంకా పాతాళానికి పోతావ్‌: కొట్టు సత్యనారాయణ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top