సీజే రోస్టర్‌కే జడ్జీలు కట్టుబడి ఉండాలి | Sakshi
Sakshi News home page

సీజే రోస్టర్‌కే జడ్జీలు కట్టుబడి ఉండాలి

Published Fri, Oct 27 2023 4:57 AM

Judges should stick to the CJ roster - Sakshi

సాక్షి, అమరావతి: ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే నిర్ణయించే రోస్టర్‌ (ఏ న్యాయమూర్తులు ఏ రకమైన కేసులు వినాలి)ను అనుసరించే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి కేటాయించని కేసుపై న్యాయమూర్తులు విచారణ జరపడం తీవ్రమైన అనౌచిత్యమని స్పష్టంచేసింది. న్యాయ­మూ­ర్తు­లందరూ కూడా ప్రధాన న్యాయమూర్తి నిర్ధేశించిన రోస్టర్‌కు కట్టుబడి ఉండాలని తేల్చి­చెప్పింది. అలాగే, వారంతా క్రమశిక్షణతో వ్యవ­హరించాలని, సీజే కేటాయించిన కేసు తప్ప మరే ఇతర కేసును విచారించడానికి వీల్లేదని తెలిపింది.

రోస్టర్‌ ప్రకారం నిర్ధిష్ట కేటగిరి కింద తమ ముందుకొచ్చిన కేసును విచారించడం లేదా సీజే నిర్ధిష్టంగా అప్పగించిన కేసును విచారించడం మాత్రమే న్యాయమూర్తులు చేయాల్సి ఉంటుందని ‘సుప్రీం’ స్పష్టంచేసింది. అలాగే, కొందరు కక్షిదారులు తాము అనుకున్న ఉత్తర్వులు పొందేందుకు తమ కేసును నిర్ధిష్టంగా ఓ న్యాయమూర్తి వద్దకు వచ్చేలా చేయడం.. ఉత్తర్వులిచ్చే అవకాశంలేని న్యాయమూర్తి ముందు నుంచి తమ కేసును తప్పించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతుండటాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.

ఈ విధంగా ఫోరం షాపింగ్‌ (కావాల్సిన జడ్జి వద్దకు కేసు వచ్చేలా చేయడం, కేసు రాకుండా చేయడం)కు పాల్పడడం ఎంతమాత్రం సరికాదంది. తమ ముందున్న కేసులో కక్షిదారులు వ్యవహరించిన తీరు విస్మయకరమంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫోరం షాపింగ్‌కు పాల్పడినందుకు ఆ కక్షిదారులకు రూ.50వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

మొదటక్వాష్‌.. పనికాకపోవడంతో రిట్‌ పిటిషన్‌..
ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌కు చెందిన నలుగురు వ్యక్తులపై వేర్వేరుగా ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ నలుగు­రు వ్యక్తులు రాజస్థాన్‌ హైకోర్టులో సీఆర్‌పీసీ సెక్షన్‌–482 కింద క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై ఈ ఏడాది ఏప్రిల్‌ 23న విచారణ జరిపిన న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తులు కోరిన విధంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలే­దు. దీంతో ఆ నలుగురు వ్యూహం మార్చి ఆరు ఎఫ్‌ఐఆర్‌లను కలిపేసి, వాటన్నింటినీ ఒకే ఎఫ్‌ఐ­ఆర్‌గా పరిగణించాలని కోరుతూ 8 మే 2023న సివి­ల్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మరో న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తు­లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యం­తర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవా­లు చేస్తూ ఫిర్యాదుదారు అంబలాల్‌ పరిహార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటి­షన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఓకా నేతృత్వంలోని ధర్మా­సనం ఇటీవల విచారణ జరిపింది. ఆ నలుగురు వ్య­క్తులు కూడా గతంలో తమకు మధ్యంతర ఉత్త­ర్వులు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి ముం­దు తిరిగి తమ కేసు రాకుండా చేసేందుకే ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలపాలంటూ పిటిషన్‌ దాఖ­లు చేశారని అంబలాల్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. అంతేకాక.. ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లలో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా కోరా­రని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు ఫిర్యాదుదారులను అసలు ప్రతివాదులుగా చేర్చలేదని వివరించారు.

ఫోరం షాపింగ్‌కు ఈ కేసు ఓ ఉదాహరణ..
వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. గతంలో ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలంటూ క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది, ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపేయాలంటూ సివిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది ఒకరేనని గుర్తించింది. ఫోరం షాపింగ్‌కు ఈ కేసు ఓ ప్రామాణిక ఉదాహరణని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అంతేగాక.. న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి ఈ కేసు ఓ మచ్చుతునకని కూడా తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపేయాలంటూ దాఖలు చేసిన సివిల్‌ రిట్‌ పిటిషన్‌ను అసలు ఎలా విచారించారంటూ విస్మ­యం వ్యక్తంచేసింది.

క్రిమినల్‌ కేసులను విచారించేందుకు సీజే నిర్ధిష్ట రోస్టర్‌ను ఖరారు చేశారని.. ఈ కేసులో నలుగురు నిందితులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను న్యాయస్థానాలు అనుమతిస్తూ వెళ్తే సీజే నిర్ధేశించే రోస్టర్‌కు ఎంతమాత్రం విలువ ఉండదని తేల్చిచెప్పింది. ఆ నలుగురు వ్యక్తులు మరో న్యాయమూర్తి ముందు దాఖలు చేసిన సివిల్‌ రిట్‌ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ నలుగురు వ్యక్తుల వ్యవహారశైలిని సెక్షన్‌–482 కింద వీరి పిటిషన్లను విచారిస్తున్న న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాలని స్పష్టంచేసింది.

‘ఫోరం షాపింగ్‌’ బాబు బ్యాచ్‌కు కొట్టిన పిండి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుతో పాటు విభజిత ఏపీ హైకోర్టులో కూడా ఫోరం షాపింగ్, నాట్‌ బిఫోర్‌ అనగానే వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబు అండ్‌ కోనే. గతంలో ఎన్నడూ వినని, తెలియని ఫోరం షాపింగ్, నాట్‌ బిఫోర్‌ వంటి వాటిని సామాన్య జనానికి తెలిసేలా చేసింది ఆ బ్యాచే. గతంలో చంద్రబాబు ఈ ‘ఫోరం షాపింగ్‌’ ను అడ్డంపెట్టుకుని ఎన్నో కేసుల నుంచి బయటపడ్డ ఉదంతాలున్నాయి. 

అక్రమాస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. 
రామోజీ, చంద్రబాబు తదితరుల అక్రమార్జనపై వైఎస్‌ విజయమ్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనూ చంద్రబాబు అండ్‌ కో వేసిన నాట్‌ బిఫోర్‌ నాటకాలతో న్యాయవ్యవస్థే విస్మయం చెందింది. 
ఫలానా న్యాయమూర్తి తమకు అనుకూలంగా ఉత్తర్వులివ్వరని భావిస్తే, అతనిపైకి కొందరు న్యాయవాదులను ఉసిగొల్పి, ఆ న్యాయమూర్తితో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని ఆ కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకునేలా చేసిన కేసులూ ఎన్నో. 
ఇలా న్యాయమూర్తులతో గొడవలు పెట్టుకున్నందుకు ఆ న్యాయవాదులకు పెద్ద మొత్తాల్లో డబ్బు ముట్టజెప్పిన సంగతి న్యాయవర్గాల్లో అందరికీ తెలుసు. 
తాజాగా.. ఓ కేసులో కూడా చంద్రబాబు బృందం ఇలానే ఫోరం షాపింగ్‌కు పాల్పడింది. దీనిపై ప్రస్తుతం న్యాయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 

Advertisement
 
Advertisement