AP CM YS Jagan Launches Jagananna Suraksha, Starting From Today - Sakshi
Sakshi News home page

AP: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’  కార్యక్రమం ప్రారంభం

Jul 1 2023 3:13 AM | Updated on Jul 1 2023 12:21 PM

Jagananna Suraksha from today - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజల వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా అర్హులందరికీ వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’ ద్వారా నేటి నుంచి సచివాలయాలవారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. 

ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ప్రారంభమైంది. సమస్యలు పరిష్కరించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్నారు ప్రజాప్రతినిధులు.

తొలిరోజు జూలై 1వ తేదీన 1,306 సచివాలయాల పరిధిలో క్యాంపులు జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు జూన్‌ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతుల వివరాలను సేకరించారు.

తొలిరోజు క్యాంపులకు సంబంధించి 14,29,051 కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ శుక్రవారం ఎస్‌ఎంఎస్‌ రూపంలో కూడా సమాచారాన్ని పంపింది.

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రత్యేక క్యాంపులకు సంబంధించి 11 రకాల ప్రధాన ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలను వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  


జగనన్న సురక్ష కార్యక్రమం కింద జూలై 1వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నెల రోజుల పాటు నిర్దేశిత తేదీల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

సచివాలయాల వద్ద మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రత్యేక క్యాంపులలో అందే వినతులను అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఏడు రోజుల ముందే దరఖాస్తులను స్వీకరించడంతోపాటు టోకెన్లను కూడా జారీ చేస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం వరకు 9.48 లక్షల టోకెన్లు జారీ కాగా 6.77 లక్షల వినతుల వివరాలను సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లు కంప్యూటర్లలో నమోదు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పటికప్పుడే పరిష్కారానికి అవకాశం ఉన్న 2.65 లక్షల వినతులకు సంబంధించి క్యాంపు నిర్వహణకు ముందే అధికారుల స్థాయిలో ఆమోద ప్రక్రియ పూర్తయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement