అదిరిపడి.. ఆగమేఘాలపై కేసు నమోదు | Investigation team visits Saikrishna house records statements of family members | Sakshi
Sakshi News home page

అదిరిపడి.. ఆగమేఘాలపై కేసు నమోదు

Jun 20 2026 4:56 AM | Updated on Jun 20 2026 5:34 AM

Investigation team visits Saikrishna house records statements of family members

జగన్‌ రంగంలోకి దిగడంతో సాయికృష్ణ కేసులో ప్రభుత్వం తత్తరపాటు 

రాత్రివేళ కుటుంబ సభ్యులతో ఫిర్యాదు.. కేసు నమోదు 

కేవలం సీఐపై కేసు నమోదు చేసి పోలీసు పెద్దలను తప్పించేలా కుట్ర 

సాయికృష్ణ ఇంటికి దర్యాప్తు బృందం.. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌లు నమోదు 

మే 9 నుంచి జరిగిన పరిణామాలను వివరించిన కుటుంబ సభ్యులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ/కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రంగంలోకి దిగడంతో ప్రభుత్వం తత్తరపాటుకు గురైంది. ఆలస్యం చేస్తే మరింతగా మెడకు చుట్టుకునేలా ఉందని బెంబేలెత్తిన ప్రభుత్వం.. వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలరింగ్‌ ఇచ్చింది. కృష్ణలంక సీఐని బలిపశువును చేసి, మిగతా పెద్దలందరూ బయటపడేలా పన్నాగం పన్నింది. వైఎస్‌ జగన్‌ గురువారం సాయికృష్ణ తల్లిని పరామర్శించగానే, ప్రభుత్వం ఆగమేఘాలపై కదిలింది. 

విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ గురువారం రాత్రి 11 గంటలకు సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఫిర్యాదు తీసుకొని, అప్పటికప్పుడు కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీసు స్టేషన్‌ ఏసీపీ వై.దైవ ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. అందులోనూ కృష్ణలంక సీఐ ఒక్కడినే బలిపశువును చేసి, మిగతా పెద్దలను తప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. 

క్రైమ్‌ నంబరు  107/2026గా నమోదైన ఈ కేసులో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 127(4), 127(6), 103(1) తోపాటు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 238 కింద అభియోగాలు నమోదు చేశారు. ఏ క్షణంలోనైనా సీఐ నాగరాజును ఆరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లాకప్‌డెత్‌ వ్యవహారం ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి, పోలీసు బాస్, అందరికీ తెలిసినా మభ్యపెట్టే యత్నం చేశారు. మిగతా పెద్దలంతా కేసు నుంచి బయట పడేందుకు సీఐ ఒక్కడిపైనే కేసు నమోదు చేయడాన్ని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. 

రెండు గంటలు కుటుంబ సభ్యుల విచారణ 
విచారణాధికారి వై.దైవప్రసాద్‌ శుక్రవారం ఉదయమే ఇతర సిబ్బందితో కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. తల్లి విజయలక్ష్మి, మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గ నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. రెండు గంటలపాటు వారిని విచారించారు. మే 9న పోలీసులు తన వద్ద ఫోన్‌ లాక్కుని వెళ్లి, సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకు వచ్చిన నాటి నుంచి జరిగిన పరిణామాలను అతని తల్లి వివరించారు. సీఐ నాగరాజుతో పాటు, అదే స్టేషన్‌లోని కానిస్టేబుళ్ల పాత్ర గురించి కూడా ఆమె వివరించారు.

సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత విచారించిన టాస్‌్కఫోర్స్‌ ఏసీపీ లతాకుమారిని విచారణాధికారి దైవప్రసాద్‌ సాయంత్రం కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా, సాయికృష్ణ తల్లి మరో ఆరుగురు కానిస్టేబుళ్లపై ఆరోపణలు చేస్తుండగా, వారంతా అదే పోలీస్‌ స్టేషన్‌లో దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటప్పుడు విచారణ సక్రమంగా ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విధుల నుంచి తప్పించి విచారణ జరిపించాలని కోరుతున్నారు. 

స్టేషన్‌లో క్లూస్‌ టీమ్‌ తనిఖీలు 
కాగా కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో క్లూస్‌ టీమ్, ఫోరెన్సిక్‌ బృందాలు శుక్రవారం తనిఖీలు చేశాయి. స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించాయి. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు చేయించుకున్న సంతకాల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం.  

నిందితులకు శిక్ష పడే వరకు నిద్రపోము: సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు 
సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చి, అదృశ్యం చేసిన నాటి నుంచి మాకు మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు అనేక సార్లు సహకరించారు. మా కేసు వెలుగులోకి రావడంలో మీడియా కీలకంగా వ్యవహరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడేవరకూ నిద్రపోము. ఈ నెల 29న హైకోర్టు వాయిదా ఉంది. సీఐతో పాటు మిగతా వారి వివరాలు కూడా విచారణాధికారికి ఇచ్చాం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement