
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో విచారణ కమిటీ పరిశీలన కొనసాగుతోంది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి చెందిన బంగారు, వెండి, ఇతర విలువైన వస్తువులు, ఆభరణాల తనిఖీలను దేవదాయశాఖ, రాజమహేంద్రవరం ఆర్‌జేసీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ శనివారం ప్రారంభించింది. ఈ తనిఖీలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి.
రికార్డ్ మెయిన్‌టైన్ చేయకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆలయ ఉద్యోగుల నుంచి పలు వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. కడప జిల్లాకు చెందిన కె.ప్రభాకరాచారి గతేడాది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రికార్డుల్లో పేర్కొన్న వివరాలకు, వాస్తవంగా ఉన్న ఆభరణాలకు తేడాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యా దుపై దేవదాయశాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు ఈ ఏడాది జనవరి 17 నుంచి నెలరోజుల పాటు రికార్డులను పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా మరింత లోతుగా తనిఖీలు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. ఆ తర్వాత ఆ విషయం మరుగున పడింది. ప్రస్తుతం రాజమండ్రి ఆర్‌జేసీగా కూడా విధులు నిర్వహిస్తున్న సింహాచలం ఇన్‌చార్జి ఈవో త్రినాథరావు చొరవతో ఈ తనిఖీలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయానికి చేరుకున్న కమిటీ సభ్యులు.. ముందుగా బండాగారంలోని ఆభరణాలు, వస్తువులను వాటి రికార్డులతో సరిపోల్చి బరువులు తనిఖీ చేశారు.
ఈ కమిటీలో విజయనగరం డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి పల్లంరాజు, అంతర్వేది ఈవో ఎం.కె.టి.ఎన్.ప్రసాద్, తూర్పుగోదావరి డిప్యూటీ ఈవో ఇ.వి.సుబ్బారావు, ఆర్‌జేసీ కార్యాలయం సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఈ తనిఖీలు పారదర్శకంగా జరుగుతున్నాయని, పూర్తి నివేదికను సమరి్పస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో అర్చకుల ఆ«దీనంలో ఉన్న వస్తువులు, మ్యూజియం, బ్యాంకుల్లో ఉన్న వస్తువులను కూడా పరిశీలిస్తామని వారు పేర్కొన్నారు.