ప్రమాదకరంగా పెదముషిడివాడ వంతెన
పరవాడ: లంకెపాలెం–సబ్బవరం రహదారిలో పెదముషిడివాడ వద్ద ఏర్పాటు చేసిన వంతెన మరమ్మతులతో మూల్గుతోంది. ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనకు కనీస మరమ్మతులు చేపట్టని కారణంగా ప్రమాద స్థాయికి చేరింది. వంతెనకు ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడలు కూలిపోతున్నాయి. వంతెనపై నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో వంతెన అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనకు ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడలు కూడా శిథిలావస్థకు చేరాయి. వాహనాలు ఢీ కొట్టడడం వల్ల రక్షణ గోడలు విరిగిపోయి ప్రయాణికుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వంతెన రోడ్డు గోతులమయం కావడంతో వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరంగా మారిన వంతెనకు మరమ్మతులు చేపట్టడానికి రోడ్లు భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


