రఘురామకృష్ణరాజు బారినుంచి కాపాడండి | Industrialist Madala Srinivas files urgent petition in High Court | Sakshi
Sakshi News home page

రఘురామకృష్ణరాజు బారినుంచి కాపాడండి

Aug 21 2026 4:59 AM | Updated on Aug 21 2026 4:59 AM

Industrialist Madala Srinivas files urgent petition in High Court

ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది 

ఆయన కంపెనీని వేలంలో కొన్నానని నన్ను బెదిరిస్తున్నాడు 

నిధుల మళ్లింపు, రుణాల ఎగవేతపై ఆధారాలు సీబీఐకి ఇవ్వొద్దని భయపెడుతున్నాడు 

మా ఇంటికి మనుషులను పంపి నన్ను కిడ్నాప్‌ చేయించేందుకు ప్రయత్నించాడు 

దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు 

నాకు 2+2 భద్రత కల్పించండి.. ఇందుకు ఖర్చును నేనే భరిస్తాను 

హైకోర్టులో పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాసు అత్యవసర పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ చెప్పుకునే తండ్రీ, కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లకు తమ పార్టీ నేత, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అరాచకాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఓ వ్యాపారవేత్త చేసేదేమీ లేక భద్రత కోసం హైకోర్టు తలుపుతట్టారు. రఘురామకృష్ణరాజు కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని రుణాలుగా తీసుకుని దారి మళ్లించిన వ్యవహారంలో తన వద్ద ఉన్న ఆధారాలను సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓకి ఇవ్వొద్దంటూ బెదిరిస్తున్నారని, తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాసు హైకోర్టులో గురువారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

2+2 భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని, అందుకయ్యే ఖర్చును తానే భరిస్తానని శ్రీనివాసు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  కృష్ణరాజుకు చెందిన ఇండ్‌ భారత్‌ పవర్‌ జెన్‌కాం కంపెనీని వేలం పాటలో కొనుగోలు చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన మనుషులు తన ఇంటికి వచ్చి బెదిరించారని, ఈ  ఘటనకు సంబంధించి తానిచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నమోదుచేయలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేలా గుంటూరు, పట్టాభిపురం పోలీసులను ఆదేశించాలని కూడా ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్‌ అయినంత మాత్రాన ఆయన చేసే నేరపూరిత చర్యలకు చట్టపరమైన రక్షణ ఏదీ లేదన్నారు. కాగా, కోర్టు సమయం అయిపోవడంతో ఆయన పిటిషన్‌ విచారణకు రాలేదు.  

క్రిమినల్‌ కేసులు వెంటాడతాయన్న భయంతోనే..
‘తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న 189 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్ట్‌  కంపెనీ ఇండ్‌–భారత్‌ పవర్‌ జెన్‌కామ్‌  గతంలో రఘురామకృష్ణరాజు, ఆయన కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉండేది.  భారీ ఆరి్థక బకాయిల వల్ల నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ సదరు కంపెనీ లిక్విడేషన్‌కు ఆదేశించింది. 2022 మే 13న జరిగిన బహిరంగ ఈ–వేలంలో నేను, నా సతీమణి అనిత కన్సారి్టయం రూ.101.42 కోట్లకు (వడ్డీతో కలిపి) కంపెనీని కొనుగోలు చేశాం. రఘురామకృష్ణరాజు చెల్లించాల్సిన రూ.267.88 కోట్లను వసూలు చేసుకోవడానికి, న్యాయస్థానాల్లో కేసులను కొనసాగించడానికి చట్టబద్ధమైన బాధ్యత, హక్కులను ఈ ఎన్‌సీఎల్‌టీ మాకు ఈ సందర్భంగా ఇచ్చింది.  

రూ.1,185 కోట్ల బ్యాంకు రుణాన్ని రఘురామకృష్ణరాజు దారి మళ్లించిన వ్యవహారంపై సీబీఐ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కంపెనీ ప్రస్తుత యజమానిగా, అధికారిక రికార్డుల కస్టోడియన్‌గా ఎస్‌ఎఫ్‌ఐఓ జారీ చేసిన సమన్ల ప్రకారం, పాత రికార్డులు, లావాదేవీల చిట్టాలు, ఇతర కీలక ఆర్థిక పత్రాలను దర్యాప్తు సంస్థల ముందు ప్రవేశపెట్టాల్సిన చట్టబద్ధమైన బాధ్యత నాపై ఉంది.  ఈ కీలకమైన రికార్డులు గనుక సీబీఐ, ఎస్‌ఎఫ్‌ఐఓ చేతికి చిక్కితే తనపై క్రిమినల్‌ కేసుల విచారణ వేగవంతమై శిక్ష పడుతుందనే భయంతో రఘురామకృష్ణరాజు మా ఇంటిపై దాడి చేయించి ఆ పత్రాలను లాక్కోవడానికి ప్రయత్నించారు’ అని పిటిషనర్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement