‘స్థానిక’ పదవులకూ కోత | Amendments to Panchayat Raj and Municipal Acts approved | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పదవులకూ కోత

Aug 21 2026 4:55 AM | Updated on Aug 21 2026 4:55 AM

Amendments to Panchayat Raj and Municipal Acts approved

జెడ్పీలో ఇక ఒకరే వైస్‌ చైర్‌పర్సన్‌

మండల పరిషత్‌లలోనూ ఒక ఉపాధ్యక్ష పదవితో సరి

నగరపాలక సంస్థల్లో ఒకరే డిప్యూటీ మేయర్‌ 

మున్సిపాలిటీల్లో ఉండేది ఒక వైస్‌ చైర్‌పర్సనే 

పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాల సవరణకు ఆమోదం 

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల్లో పదవులకూ చంద్రబాబు ప్రభుత్వం కోత పెట్టింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో పదవుల సంఖ్యను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్‌ చట్టంతోపాటు మున్సిపల్‌ చట్టాలకు సవరణలు చేస్తూ అసెంబ్లీ, శాసనమండలిలో గురువారం ప్రవేశపెట్టిన బిల్లులకు ఆమోదం లభించింది. జిల్లా పరిషత్‌లలో ప్రస్తుతం ఇద్దరేసి చొప్పున ఉండే వైస్‌ చైర్‌పర్సన్, మండల పరిషత్‌లలో రెండేసి చొప్పున ఉండే ఉపాధ్యక్ష పదవులను, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో ఇద్దరు చొప్పున ఉండే డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను ఒకటికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021లో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వైస్‌ చైర్‌పర్సన్లు, డిప్యూటీ మేయర్‌ వంటి పదవులు రెండేసి ఉండేలా చర్యలు చేపట్టారు.  

గ్రామీణ స్థానిక సంస్థల్లో ఇలా.. 
ప్రస్తుతం జిల్లా పరిషత్‌లలో ఇద్దరేసి చొప్పున ఉన్న వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను ఒకటికి కుదించారు. మండల పరిషత్‌లలో రెండేసి చొప్పున ఉన్న ఉపాధ్యక్ష పదవులను ఒకటికి తగ్గించారు. బహుళ నాయకత్వం వల్ల పరిపాలనాపరంగా ఎలాంటి ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తాజా బిల్లులో పేర్కొంది. 

పురపాలనలోనూ.. 
నగరపాలక సంస్థల్లో రెండేసి చొప్పున ఉన్న డిప్యూటీ మేయర్‌ పదవులను ఒకటి చొప్పున తగ్గించారు. మున్సిపాలిటీలలో రెండు చొప్పున ఉన్న వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులను ఒకటికి కుదించారు. నగరపాలక సంస్థల్లో మేయర్లు, మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్‌లను నేరుగా ఓటర్లే ఎన్నుకునేలా ప్రత్యేక ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఎన్నికల విధానంలో కొత్త నిబంధనలు 
నగరపాలక సంస్థ మేయర్‌ లేదా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పోటీ చేసేవారు ఆయా కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఓటరు అయి ఉండాలి. వార్డు సభ్యులు/కార్పొరేటర్లు, మేయర్‌/చైర్‌పర్సన్‌లను ఒకేసారి రెండు ఓట్ల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పదవీ కాలం ముగియడానికి 6 నెలల ముందు ఖాళీ ఏర్పడితే తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎన్నికైన తొలి సమావేశంలోనే వార్డు సభ్యులు లేదా డివిజన్‌ కార్పొరేటర్ల ద్వారా పరోక్ష విధానంలో డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరిస్తే అనర్హత వేటువేసే నిబంధన వర్తిస్తుంది. మేయర్‌ లేదా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వారు ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవుల్లో ఉంటే.. స్థానిక సంస్థల ఫలితం వెలువడిన 15 రోజుల్లోగా ఏదో ఒక పదవిని ఎంచుకోవాల్సి ఉంటుంది.  

గ్రామీణ స్థానిక సంస్థలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
జీఓ జారీచేసిన ప్రభుత్వం 
సాక్షి, అమరావతి : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది. పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు, సర్పంచి పదవులు.. మండల పరిషత్‌ ఎన్నికల్లో ఎంపీటీసీ, ఎంపీపీ పదవులు.. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్‌ పదవులకు ఆయా రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆదేశాల్లో పేర్కొంది. 

అయితే, రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం ప్రభుత్వం హైకోర్టులో నివేదిక అందజేయగా హైకోర్టు ఎన్నికల రిజర్వేషన్లు 50 శాతానికి దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అంటూ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌కు సూచించిన విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీఓలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే మొత్తం రిజర్వేషన్ల శాతాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కారణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించే పరిస్థితి ఉండగా, కోర్టు సూచన తర్వాత కూడా బీసీలను మోసంచేస్తూ ప్రభుత్వం ఈ జీఓ జారీచేసిందన్న చర్చ సాగుతోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement