దేశ జీడీపీ రూ.387 లక్షల కోట్లుగా ఐఎంఎఫ్ అంచనా
భారతీయుల వద్ద బంగారం నిల్వలు 34,600 టన్నులు
దాని విలువ రూ.450 లక్షల కోట్లకు పైనే ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక
ఇది కాకుండా ఆర్బీఐ వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు
సాక్షి, అమరావతి: బంగారం... భారతీయుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసింది. అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని అధిగమించేసిందంటే ఏ స్థాయిలో ప్రజల వద్ద బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్ల) మార్కును దాటేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం... ప్రస్తుతం భారతదేశ జీడీపీ 4.1 ట్రిలియన్ డాలర్ల (రూ.387 లక్షల కోట్లు) వద్దే ఉంది.
2025లో బంగారం 65 శాతం పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలకు చేరినప్పుడు.. భారతీయుల బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు మోర్గాన్‌స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.55 లక్షలు దాటడంతో ఈ విలువ మరింత పెరిగింది. భారతీయుల వద్ద ఆభరణాలు, తదితరాల రూపంలో 34,600 టన్నుల బంగారం ఉందని.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్లు అధిగమించడం ద్వారా భారతీయుల బంగారం విలువ దేశ జీడీపీని అధిగమించిందని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,987 డాలర్లు అధిగమించింది.
ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్బీఐ 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో ఆర్‌బీఐ బంగారం వాటా సుమారు 14 శాతానికి సమానమట. అయితే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80 శాతం ఆభరణాల రూపంలోనే ఉందని నివేదిక వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భారతీయులు భావించడం మొదలు పెట్టారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లలో 24 శాతం పైన వృద్ధి నమోదవ్వడమే ఇందుకు సంకేతం.


