
సాక్షి, విశాఖపట్నం: మన దేశంలోని రెండు షిప్‌యార్డుల్లో రూపుదిద్దుకున్న రెండు యుద్ధనౌకలు ఈ నెల 26న భారత నౌకాదళంలో చేరనున్నాయి. అత్యాధునిక ఫ్రంట్‌లైన్ స్టీల్ ఫ్రిగేట్ యుద్ధనౌకలు రెండింటిని జాతికి అంకితం చేసే కార్యక్రమం విశాఖపట్నం వేదికగా జరగనుంది. ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్)లో ఐఎన్‌ఎస్ ఉదయగిరి, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ)లో ఐఎన్‌ఎస్ హిమగిరి యుద్ధనౌకల్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.
ప్రాజెక్ట్–17లో భాగంగా వీటిని అత్యాధునిక సాంకేతికతతో నిరి్మంచారు. ఐఎన్‌ఎస్ ఉదయగిరి.. నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ షిప్ కావడం మరో విశేషం. దాదాపు 6,700 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకలు శివాలిక్–క్లాస్ ఫ్రిగేట్స్ కంటే దాదాపు ఐదుశాతం పెద్దవి.
ఈ రెండింటి ఆయుధాల భాగంలో సూపర్‌సోనిక్ సర్ఫేస్–టు–సర్ఫేస్ క్షిపణులు, మీడియం రేంజ్ సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణులు, 76ఎంఎం ఎంఆర్ గన్స్‌తో పాటు యాంటీ–సబ్‌మెరైన్/అండర్‌వాటర్ వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి. భారతీయ నౌకాదళ పటిష్టత, సత్తాని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నేవీ అధికారులు తెలిపారు.