ఆదాయార్జనలో వాల్తేరు 5వ స్థానం
నవంబర్ వరకు రూ.9,030 కోట్ల ఆదాయం 73.5 ఎంటీ సరుకు రవాణాతో దేశంలో 5వ స్థానం వాల్తేరు డివిజన్‌లో ఈ ఏడాది 506 ప్రత్యేక రైలు సర్వీసులు 23 రైళ్లలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మార్పు వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బొహ్రా
సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైల్వేలో వాల్తేర్ డివిజన్ తనదైన ముద్ర వేస్తూ 2025 ఏడాదిని ఘనంగా ముగించిందని డీఆర్‌ఎం లలిత్ బొహ్రా వెల్లడించారు. ఈ ఏడాది డివిజన్ సాధించిన విజయాల వివరాల్ని డీఆర్‌ఎం బుధవారం వెల్లడించారు. ప్రయాణికుల సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, భద్రత, ఆదాయార్జనలో సరికొత్త మైలురాళ్లను అధిగమించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యధిక ఆదా యంతో పాటు సరకు రవాణా విషయంలోనూ వాల్తేరు డివిజన్ ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు. ప్రయాణికుల భద్రత కోసం ఎల్‌హెచ్‌బీ రేక్‌ల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇంకా డీఆర్‌ఎం చెప్పిన వివరాలివీ.. వాల్తేర్ డివిజన్ ఈ ఏడాది సరుకు రవాణాలో సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం 230 రోజుల్లోనే 50 మిలియన్ టన్నుల లోడింగ్ పూర్తి చేయగా, నవంబర్ నాటికే 73.5 మిలియన్ టన్నుల సరకు హ్యాండ్లింగ్‌తో రికార్డు సృష్టించి దేశంలోని డివిజన్లలో ఐదో స్థానంలో నిలిచింది. అదేవిధంగా మొత్తం రూ.9,030 కోట్ల ఆదాయా న్ని ఆర్జించి.. దేశంలో 5వ ర్యాంక్ సాధించాం.
ప్రయాణికుల రాకపోకల్లో 10 శాతం వృద్ధి నమోదు: ప్రయాణికుల రాకపోకల్లోనూ 10 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం 30.58 మిలియన్ మంది ప్రయాణికులు డివిజన్ నుంచి రాకపోకలు సాగించారు. విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2025 జనవరి 11 నుంచి 16 నుంచి 20 కోచ్‌లకు పెంచారు. ప్రయాణ డిమాండ్‌ను బట్టి మొత్తం 506 ప్రత్యేక రైళ్లతో పాటు 1,803 రైళ్లను పీక్ సీజన్లలో నడిపాం. రిజర్వేషన్ లేని ప్రయాణికులకు మద్దతుగా జనరల్ కోచ్‌లను చేర్చాం. ఆన్‌బోర్డ్ సేవలను మెరుగుపరచడానికి ఓబీహెచ్‌ఎస్ సిబ్బందికి కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించాం. మార్చి 2025 నాటికి కీలక విభాగాలను రెట్టింపు చేయడంతో పాటు 360 కిలో మీటర్లకు పైగా డబుల్ లైన్‌లను ప్రారంభించడం వంటి ప్రధాన రైలు–మౌలిక సదుపాయాల పనులు వేగంగా అభివృద్ధి చెందాయి. రూ.1,200 కోట్లకు పైగా విలువైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించామని తెలిపారు.


