రెట్టింపు ఉత్సాహంతో పని చేద్దాం
సాక్షి, విశాఖపట్నం: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సుభిక్షంగా జీవించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సేవలో నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తూ, కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి పార్టీ ఆశయాలను కింద స్థాయి వరకూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అందరి సహకారంతో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దుదామని కేకే రాజు పేర్కొన్నారు.


