వీధి దీపాలపై స్పెషల్ ఫోకస్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అభివృద్ధిలో నగర పౌరుల సహకారం ఎనలేనిదని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న వీధి దీపాల మరమ్మతులకు 50 రోజుల ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, రాబోయే ఆరేడు నెలల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని వారు స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీ వెండింగ్ జోన్స్‌కి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పారదర్శక పాలన కోసం నగరాన్ని 10 జోన్లుగా విస్తరించామని, ఇప్పటివరకు 102 జంక్షన్లను ఆధునికీకరించామని వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో రెవెన్యూ వసూలైందని తెలిపారు. 2025–26 ఏడాదికి గాను రూ.657.39 కోట్ల అంచనాలతో 1,667 అభివృద్ధి పనులను చేపట్టామని, ఇందులో ఇప్పటికే రూ.82.75 కోట్లతో 486 పనులు పూర్తి చేశామని వెల్లడించారు. విశాఖను ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులు, అధికారులకు, సహకరిస్తున్న ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


