బొకేలు, స్వీట్లు వద్దు.. విరాళాలివ్వండి
మహారాణిపేట: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు బొకేలు, స్వీట్లు, కేకులు తీసుకురావొద్దని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వాటికి వెచ్చించే మొత్తాన్ని పేదలకు, అనారోగ్య బాధితులకు అండగా నిలిచే ‘సంజీవని నిధి’(జిల్లా సహాయ నిధి)కి విరాళంగా ఇవ్వాలని కోరారు. బుధవారం ఆయన జిల్లా ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. 2026లో ప్రజలందరికీ మంచి జరగాలని, వారి లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంతో.. 2026 సంవత్సరం జిల్లా అభివృద్ధిని మలుపు తిప్పబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలన్నారు. కాగా.. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి కలెక్టర్ తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.


