ఈ ఏడాది మనకు కీలకం
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
అల్లిపురం: నగరంలోని ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) పోలీస్ మైదానాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి బుధవారం ఉదయం సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన పోలీస్ కవాతును పరిశీలించారు. ప్రత్యేక వాహనంపై మైదానమంతా కలియతిరుగుతూ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మైదానంలో డాగ్ స్క్వాడ్ పనితీరు, సిబ్బంది చేసిన లాఠీ డ్రిల్, ఆర్మ్ డ్రిల్, బ్యాండ్ ప్రదర్శన, వెపన్ స్ట్రిప్పింగ్ అండ్ అసెంబ్లింగ్ (ఆయుధాలను విడదీయడం, అమర్చడం) విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం దర్బార్ నిర్వహించి సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2026లో నగరంలో మరిన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరగనున్నాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. సిబ్బందికి ఏ సమస్య వచ్చినా, ఎటువంటి సలహాలు ఉన్నా నేరుగా తన మొబైల్ నంబరు 79950 95799కు సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు. చివరగా సిబ్బంది అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


