సముద్ర భద్రతకు ‘అక్షయ’ అస్త్రం! | Indian Coast Guard commissions Fast Patrol Vessel ICGS | Sakshi
Sakshi News home page

సముద్ర భద్రతకు ‘అక్షయ’ అస్త్రం!

Jun 29 2026 4:56 AM | Updated on Jun 29 2026 4:56 AM

Indian Coast Guard commissions Fast Patrol Vessel ICGS

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ అమ్ములపొదిలో ఐసీజీఎస్‌ అక్షయ్‌

గోవాలో జాతికి అంకితం చేసిన కోస్ట్‌గార్డ్‌ అధికారులు 

తూర్పు, పశ్చిమ తీరాల్లో సేవలందించనున్న అక్షయ్‌ 

సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొంటూ.., శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టే అత్యాధునిక నిఘా నేత్రం.. సముద్రపు అలలను చీల్చుకుంటూ ఆపదలో ఉన్న మత్స్యకారులను కాపాడేందుకు వాయువేగంతో కదిలే కవచం.. లాంఛనంగా ఇండియన్‌ కోస్ట్‌గార్డు అమ్ముల పొదిలో చేరింది.. గోవా షిప్‌యార్డులో తయారైన ఐసీజీఎస్‌ అక్షయ్‌ని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పరమ్‌సేన్, కోస్ట్‌గార్డ్‌ వెస్ట్‌ కమాండర్‌ ఐజీ బీషమ్‌శర్మ ఆదివారం జాతికి అంకితం చేశారు. ఆద్యమ క్లాస్‌ సిరీస్‌లో నాలుగో నౌకగా తయారైన అక్షయ్‌... తూర్పు, పశ్చిమ తీరాల్లో సేవలందించనుందని కోస్ట్‌గార్డు వర్గాలు వెల్లడించాయి. 

52 మీటర్ల పొడవు, 320 టన్నుల భారీ సామర్థ్యంతో అత్యాధునిక రక్షణ వ్యవస్థతో నిర్మించారు. 3,000 కిలోవాట్ల డీజిల్‌ ఇంజిన్లు రెండింటిని అమర్చారు. కంట్రోలబుల్‌ పిచ్‌ ప్రొపెల్లర్‌ సాంకేతికతతో సముద్రంలో అసాధారణ వేగంతో.. అత్యంత సులువుగా దిశను మార్చుకుంటూ దూసుకుపోగల సత్తా దీని సొంతం. ఈ ఫాస్ట్‌ పెట్రోల్‌ వెసల్‌ భారతీయ తీరరక్షక దళం (కోస్ట్‌గార్డ్‌) అమ్ములపొదిలో సరికొత్త బ్రహ్మస్త్రంగా నిలవనుంది. శత్రు మూకలను మట్టికరిపించేందుకు వీలుగా దీనిపై అమర్చిన 30 ఎంఎం సీఆర్‌ఎన్‌–91 నేవల్‌ గన్, 12.7 ఎంఎం రిమోట్‌ కంట్రోల్డ్‌ మెషీన్‌గన్స్‌.. సముద్ర జలాల్లో చొరబాటుదారులకు సింహస్వప్నంగా మారనున్నాయి. 

భద్రతకు భరోసానిస్తూ.. 
దేశ వాణిజ్యంలో 95 శాతం సముద్ర మార్గం ద్వారానే జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, తీరప్రాంత భద్రత అత్యంత కీలకంగా మారింది. ఈ తరుణంలో.. ఐసీజీఎస్‌  అక్షయ్‌ సాగర జలాల్లో బ­హు­ముఖ పాత్రను పోషించనుంది. కేవలం నిఘాకే పరిమితం కాకుండా, సముద్ర చట్టాల అమలు, యాంటీ స్మగ్లింగ్‌ ఆపరేషన్లు, సముద్రపు దొంగల (పైరసీ) నివారణలో ఇది క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని కోస్ట్‌గార్డ్‌ అధికారులు చెబుతున్నారు. 

దేశ ప్రత్యేక ఆర్థిక మండలి రక్షణతో పాటు, సముద్రంలో కాలుష్య ప్రమాదాలను అరికట్టడం, విపత్తుల సమయంలో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్లలోనూ కీలక పాత్ర పోషించనుంది. అత్యాధునిక రాడార్, కమ్యునికేషన్‌ వ్యవస్థలతో భారత తీర రక్షణ సామర్థ్యాన్ని అక్షయ్‌ మరింత బలోపేతం చేస్తుందని సాయుధ దళాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

65 శాతం స్వదేశీ పరికరాల వినియోగం.. 
గోవా షిప్‌యార్డులో అక్షయ్‌ని తీర రక్షక దళానికి అధికారికంగా అప్పగించారు. ఆద్యమ క్లాస్‌ సిరీస్‌లో రూ.473 కోట్ల బడ్జెట్‌తో నిరి్మస్తున్న ఎని­మిది నౌకల్లో ఇది నాలుగోది కావడం విశేషం. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు కాగా.. ఇందులో ఏకంగా 65 శాతానికి పైగా స్వదేశీ  పరికరాలని వినియోగించడం.. ఆత్మనిర్భర్‌ భారత్‌కు దన్నుగా నిలిచింది. అక్షయ్‌కు మొదటి కమాండింగ్‌ ఆఫీసర్‌గా కమాండెంట్‌ దీపక్‌ చౌబే వ్యవహరిస్తారు. ఈ వెసల్‌లో మొత్తం ఆరుగురు అధికారులు, 35 మంది సెయిలర్స్‌ బృందం విధులు నిర్వర్తించనుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement