పర్యాటకం.. ప్రగతిపథం | Sakshi
Sakshi News home page

పర్యాటకం..ప్రగతిపథం

Published Sat, Sep 17 2022 10:59 AM

Income Of The Tourism Department Improved In YSR Chittoor Districts - Sakshi

కడపజిల్లాలో మెరుగైన ఆదాయం
ఉమ్మడి కడప జిల్లాలో టూరిజానికి చెందిన ఐదుచోట్ల పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు నిర్వహణలో ఉన్నాయి. వీటికి 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.4.07 కోట్ల ఆదాయం వచ్చింది. 2022 ఏప్రిల్, మే, జూన్, జూలై నాలుగు నెలలకే రూ.1.56 కోట్ల ఆదాయం లభించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత ఏడాదికి మించిన ఆదాయం రానుంది. ఇందులో ప్రధానంగా కడప హోటల్, గండికోట యూనిట్ల ద్వారా లభించనుంది. 

బి.కొత్తకోట: కోవిడ్‌ కష్టాలు, నష్టాలను అధిగమిస్తూ పర్యాటకశాఖ ఆదాయం వైపు పరుగులు తీస్తోంది. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 ఆగస్టు వరకు టూరిజం పడకేసింది. బొటాబోటి ఆదాయంతో యూనిట్లు నెట్టుకొచ్చాయి. పలుచోట్ల కోవిడ్‌ ఆస్పత్రులకు భోజనం సరఫరా చేయడంతోనే సరిపోయింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి పర్యాటక పరిస్థితులు మళ్లీ గాడిలో పడ్డాయి. పర్యాటకుల సందర్శనలు మొదలయ్యాయి. దీనితో టూరిజం అధికారులు అప్రమత్తం అయ్యారు. కోవిడ్‌తో అవస్థలు పడిన ప్రజలు సేదతీరేందుకు పర్యాటక ప్రాంతాలవైపు చూడటం గమనించిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు, సురక్షిత చర్యలు చేపట్టారు. అన్ని చర్యలు తీసుకొని సందర్శకులకు భరోసా ఇవ్వడంతో పర్యాటకం పుంజుకొంది. ఫలితంగా ప్రస్తుతం పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. దీనితో ఆదాయంలో పర్యాటక యూనిట్లు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు లక్ష ఆదాయం చూడని యూనిట్లు ఇప్పుడు లక్షల్లో ఆదాయం తెస్తున్నాయి. 

ఉరకలేస్తున్న చిత్తూరు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టూరిజం యూనిట్లు ఆదాయం వైపు ఉరకలేస్తున్నాయి. టూరిజం యూనిట్లలో బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ మొదటి వరసలో ఉంది. ఉమ్మడిచిత్తూరు, కడపజిల్లాలో అత్యధిక ఆదాయం దీనిదే. 2020–21లో రూ.2.36 కోట్ల ఆదాయం వస్తే..2021–22లో రూ.3.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2020–21లో టూరిజం యూనిట్లకు రూ.6.26 కోట్ల ఆదాయం లభించగా, తిరుపతి రవాణా విభాగం ద్వారా రూ.7.22 కోట్ల ఆదాయం సమకూరింది. 2021–22 లో యూనిట్ల ద్వారా రూ.11.58 కోట్ల ఆదాయం వస్తే, రవాణా విభాగం ద్వారా అత్యధికంగా రూ.36.19 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రూ.20 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యాటక ఆదాయం రూ.50 కోట్లకు మించనుంది.  

ప్రణాళికాబద్ధంగా కృషి
పర్యాటకశాఖ ఆదాయం పెంచుకునేందుకు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు టూరిజం ఎండీ కన్నబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. టూరిజం కేంద్రాల ఆధునికీకరణ, స్టార్‌హోటళ్ల స్థాయి సేవలు అందించేలా కృషి చేస్తున్నాం. ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు చేసింది. అతిథిగృహాల్లో సందర్శకులకు సౌకర్యాలను మెరుగుపర్చాం. దానికి తగ్గట్టుగా ఆదాయం పెంచుకొంటున్నాం.      
–మడితాటి గిరిధర్‌రెడ్డి, డివిజనల్‌ మేనేజర్, ఉమ్మడి చిత్తూరు, కడపజిల్లాలు

Advertisement
Advertisement