Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి

Implementation of 99 percent promises in the manifesto says Cm Jagan - Sakshi

ప్రమాణ స్వీకారం నుంచే మేనిఫెస్టో అమలుకు సీఎం జగన్‌ శ్రీకారం

అవ్వాతాతలకిస్తున్న పింఛన్‌ పెంపు ఫైలుపై తొలి సంతకం 

తొలి ఏడాదే మేనిఫెస్టోలో 95 శాతం హామీల అమలు

పూర్తి స్థాయిలో అమలు కానివి మద్య నియంత్రణ, సీపీఎస్‌ రద్దు

వీటిలో సీపీఎస్‌ రద్దు అసాధ్యమని తేలినా... రెండేళ్లుగా కసరత్తు

చివరకు మెరుగైన పెన్షన్‌ వచ్చేలా ‘జీపీఎస్‌’ అమలుకు పచ్చజెండా

పాత పెన్షన్‌ పథకం మాదిరే అన్ని ప్రయోజనాలూ అందేలా కసరత్తు

ఇప్పటికే దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

మద్య నియంత్రణకు వేగంగా అడుగులు.. పలు చర్యలు

గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన మద్యం, బీరు విక్రయాలు

ఈ హామీలను మినహాయిస్తే 99 శాతం అమలు చేసిన సీఎం జగన్‌

(సాక్షి, అమరావతి) :  ఓట్లడిగేటప్పుడు వందలకొద్దీ హామీలివ్వటం... తీరా ఆ ఓట్లతో గెలిచాక హామీలను పక్కనబెట్టడం!. దశాబ్దాలుగా ఇక్కడ చూస్తున్నది అదే. అలవికాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం... ఎన్నికలప్పుడు పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకు విలువివ్వటమే మానేశారు. వాటినసలు చూడకుండానే పక్కనబెట్టేస్తున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో... ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించారు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి. నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్‌ సీపీ తరఫున ఒకే ఒక పేజీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని స్పష్టంగా చెప్పారు. జనం జై కొట్టారు. ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ జరిగింది. 

మరి సింగిల్‌ పేజీ మేనిఫెస్టోతో ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు? ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారా? దీనికి నిజాయితీగా వినవచ్చే సమాధానం ఒక్కటే. అది... ‘ఆ రెండూ తప్ప’ అని!. ఎందుకంటే మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకున్న జగన్‌... తొలి ఏడాదే దాన్లో పేర్కొన్న 95 శాతం హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన సంక్లిష్టమైన హామీలను కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు.

కాకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను (సీపీఎస్‌) రద్దు చేసి ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను (ఓపీఎస్‌) తిరిగి అమల్లోకి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయారు. ఓపీఎస్‌ను తిరిగి తేవటం ఆచరణ సాధ్యం కాదని తేలినా... ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు మెరుగైన పెన్షన్‌ పథకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం రెండేళ్లుగా రకరకాల గ్రూపులతో చర్చించి కసరత్తు చేస్తూ వచ్చింది.

చివరకు వారి ప్రయోజనాలను కాపాడేలా గ్యారంటీడ్‌ పెన్షన్‌ పథకానికి (జీపీఎస్‌) రూపకల్పన చేసింది. ఉద్యోగ వర్గాలంతా ఈ జీపీఎస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది కూడా. ఇక అమలు కాని హామీల్లో రెండవది మద్య నియంత్రణ. దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గిస్తూ చివరకు దాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా... రకరకాల సాంకేతిక, ఆర్థిక కారణాలతో పూర్తి స్థాయిలో ఆ హామీ అమలు కాలేదు.

కాకపోతే నియంత్రణ దిశగా బలమైన అడుగులుపడ్డాయి. 2018–19తో పోలిస్తే విక్రయాలు 50 శాతానికన్నా తగ్గాయంటే నియంత్రణ దిశగా అడుగులు పడ్డాయన్నది స్పష్టంగా తెలియకమానదు. కాకపోతే ఈ రెండంశాలూ హామీ ఇచ్చినట్లుగా నూటికి నూరు శాతం అమలు కాలేదు కనక... మేనిఫెస్టోలో 99 శాతమే అమలయ్యిందని చెప్పాలి. నూటికి 99 శాతం మార్కులే ఇవ్వాలి. 

ఇక్కడ గమనించాల్సిందొక్కటే. అసలు మేనిఫెస్టోను ఇంత చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వాలను మనమెన్నడైనా చూశామా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదని? 2014లో ఆయన ఇచ్చిన ఏ హామీనైనా గెలిచాక అమలు చేశారా? అసలు మేనిఫెస్టోనే పార్టీ వెబ్‌సైట్లో నుంచి తొలగించిన చరిత్ర ఆయనది. ఒకటికాదు రెండు కాదు... వందలకొద్దీ హామీలనిచ్చారు. కానీ తొలి నాలుగున్నరేళ్లూ ఒక్క హామీని కూడా పట్టించుకోలేదు.

మళ్లీ 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావుడిగా కొన్ని హామీలను అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవటానికి ప్రయత్నించారు. కొద్ది మంది ఖాతాల్లో రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతిని జమచేయటం... పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు వేయటం... ఇవన్నీ ఎన్నికలకు కేవలం రెండుమూడు నెలల ముందు చేశారు. అంతేకాదు! ఈ రాష్ట్రానికి తీరప్రాంతమే మణిహా రమంటూ రకరకాల గ్రాఫిక్‌లు చూపించి... ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపనలంటూ హడావుడి చేశారు. భోగాపురం విమానాశ్రయానిదీ అదే కథ.

విచిత్రమేంటంటే ఇలా ఏ హామీనీ అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు... 2019 ఎన్నికల్లో మాత్రం తాను చెప్పివన్నీ చేశానని, మళ్లీ గెలిపిస్తే ఇంకేదో చేస్తానంటూ స్వర్గాన్ని గ్రాఫిక్‌లలో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం నిజాయితీగా తన పనితీరుకు మార్కులు వేసుకుంటున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేయటానికి ప్రయత్నించటంతో పాటు రెండంశాలు తప్ప మిగిలివన్నీ 100 శాతం అమలు చేశారు. 99 శాతం మార్కులు సాధించగలిగారు. రాజకీయ వర్గాలు ఈ రెండు మేనిఫెస్టోలనూ ‘విశ్వసనీయత– వంచన’తో పోలుస్తున్నది కూడా అందుకేనేమో!!.

ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే..
రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని సాధించాక 2019 మే 30న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ.. వృద్ధాప్య పింఛన్‌ను పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. 2019 జూన్‌ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 56 శాతం పదవులు ఇచ్చి సామాజిక విప్లవానికి తెరతీశారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నవరత్నాలతో 95 శాతం హామీలను అమలు చేశారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ మాట తప్పకుండా వాటిని కొనసాగించారు. ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ (పే రివిజన్‌ కమిషన్‌) ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటం... సీపీఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్‌ అందించేలా జీపీఎస్‌ (గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌) విధానానికి ఆమోదం తెలపటం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడంతో మేనిఫెస్టో అమల్లో మరింత ముందడుగు వేసినట్లయింది. 99 శాతం హామీలను నెరవేర్చినట్లయింది. 

ఇబ్బందుల్లోనూ చెప్పిన దాని కంటే మిన్నగా..
2020లో ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆర్థిక ఇబ్బందులను సృష్టించింది. కరోనా కష్టకాలంలోనూ.. ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమల్లో సీఎం వైఎస్‌ జగన్‌ వెనుకంజ వేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశారు.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతులకు ఇస్తాన ని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్‌.. దాన్ని మరో వెయ్యి పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చేలా అమలు చేస్తున్నారు. అంటే.. రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు అదనంగా రూ. 17,500 ప్రయోజనం చేకూరుస్తున్నారు.

మేనిఫె స్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర పథకాలనూ అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌.. తిరుపతి లోక్‌సభ, ఆత్మకూరు, బద్వే లు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు విజయాలు సాధించడమే ఆయనపై జనానికున్న నమ్మకానికి నిదర్శనం.

అర్హతే ప్రామాణికం
కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.16,786 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే (డీబీటీ ప్లస్‌ నాన్‌ డీబీటీ) లబ్ధిదారులకు రూ.3.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు.

ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి పేరిట ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చిన దాఖాలు గతమెన్నడూ లేవు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top