హైకోర్టులో కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారా?
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని డీజీపీ, డీఐజీ తదితరులకు ఆదేశం
కోర్టులోకి చొరబడిన పోలీసులకు వ్యక్తిగత నోటీసులు
కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఒక కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి ఎలా అరెస్టు చేస్తారని హైకోర్టు పోలీసు అధికారులను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, కర్నూలు రేంజ్ డీఐజీ, డీఎస్పీ తదితరులను ఆదేశించింది. చిప్పగిరి ఎస్‌ఐ సతీష్‌కుమార్, పత్తికొండ ఎస్‌ఐ ఆర్.విజయ్‌కుమార్ నాయక్, చిప్పగిరి కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీలకు వ్యక్తిగత నోటీసులు జారీచేసింది.
విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి మరీ బలవంతంగా అరెస్ట్ చేయడమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన న్యాయవాదులను తోసేసి వెళ్లిపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు.
పోలీసుల దౌర్జన్యంపై వీడియో ఆధారాలున్నాయి
పిటిషనర్ తరఫున న్యాయవాది కె.వి.రఘువీర్ వాదనలు వినిపించారు. ‘చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన శివయ్య గంజాయి సాగుచేస్తుండటంతో అతడిపై చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అతడు లొంగిపోయేందుకు గతనెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేయించారు.
ఈ పిటిషన్‌పై జడ్జి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో వేచిచూస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి దూసుకొచ్చి బలవంతంగా శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయిన న్యాయవాదులను సైతం తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది.
కోర్టు హాల్లోకి ప్రవేశించేందుకు ఆ కోర్టు న్యాయాధికారి అనుమతి తీసుకోలేదు. దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పత్తికొండ న్యాయవాదుల సంఘం సమర్పించిన వినతిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని రఘువీర్ నివేదించారు.
పోలీసులు ఏమైనా చేస్తారు
ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పోలీసులు ఇదేరీతిలో హైకోర్టులోకి వచ్చి నిందితులను అరెస్ట్ చేయగలరా? రిజిస్ట్రీ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేస్తారా? మరి కింది కోర్టులో కూడా జడ్జి అనుమతి లేకుండా నేరుగా కోర్టు హాల్లోకి వచ్చి మరీ ఎలా అరెస్ట్ చేస్తారు?.. అని ప్రశ్నించారు. బాధ్యులైన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? వారిని బదిలీ చేశారా లేదా? అని అడిగారు. ఇలాంటివాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు.. అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) స్పందిస్తూ.. ఆ పోలీసులకు చార్‌్జమెమోలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత కోర్టు మేజిస్ట్రేట్ జిల్లా ఎస్పీకి రాసిన లేఖ ఆధారంగా బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు.
బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారా? లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి.. సస్పెండ్ చేసి ఉండరులే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు హాల్లోకి చొరబడి మరీ అరెస్ట్ చేసిన పోలీసులకు వ్యక్తిగత నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.


