పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయండి
సీఐడీ దర్యాప్తు అధికారికి హైకోర్టు ఆదేశం
ఇది రూ.2,500 కోట్ల భారీ కుంభకోణం
టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇందులో పాత్రధారి
ప్రభుత్వం నియమించిన సీఐడీ ఏం చేస్తోందో తెలియడం లేదు
ధర్మాసనానికి విన్నవించిన పొన్నవోలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల భారీ ‘ఈ–స్టాంప్’ కుంభకోణానికి పాల్పడిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు పురోగతి పూర్తి వివరాలను (స్టేటస్ రిపోర్ట్) తమ ముందుంచాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతక్రితం పిటిషనర్ మాజీ ఎంపీ తలారి రంగయ్య తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం. ఎంతో పలుకుబడి కలిగిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది ఇందులో కీలక పాత్ర. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ గత ఏడాది అక్టోబర్ 7న హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశాం. ఆ మరుసటి రోజే ప్రభుత్వం కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. అయితే సీఐడీ ఇప్పటి వరకు ఏం చేసిందో తెలియడం లేదు’ అని వివరించారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి ఈ సందర్భంగా స్పందిస్తూ కుంభకోణంపై మూడు కేసులు నమోదయ్యాయని ధర్మాసనానికి తెలిపారు. 14వేల లావాదేవీలు జరిగాయని, మొత్తం రికార్డులను జప్తు చేశామని పేర్కొంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సంబంధిత కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని తెలిపారు.
పిల్ వివరాలు
అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో బోయ యర్రప్ప.. ‘బాబు మీ సేవా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం లైసెన్స్ భార్య భార్గవి పేరు మీద ఉంది. అయితే ఇప్పటి వరకు యర్రప్ప 15,851 ఈ–స్టాంపులను తారుమారు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగించారు. ఎమ్మెల్యేకు చెందిన ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ, కళ్యాణదుర్గం మీ సేవా కేంద్రం నుంచి తక్కువ విలువ కలిగిన ‘ఈ–స్టాంపు’లను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ విలువ కలిగిన ఈ స్టాంపులుగా మార్చి పలు బ్యాంకుల్లో భారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించింది.
ఈ భారీ కుంభకోణంపై స్టాంప్స్ ఐజీ, డీజీపీ, జిల్లా ఎస్‌పీకి పిటిషనర్ ఫిర్యాదు చేశారు. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సీరియస్ ఫ్రాండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) నుంచి డీజీపీకి లేఖ వెళ్లింది. అయినా ఎవ్వరినుంచీ స్పందనలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
36 గంటలు ఎలా పని చేయిస్తున్నారు?
పీజీ వైద్య విద్యార్థుల పనిగంటలపై హైకోర్టు ఆందోళన
వారి ఉపశమనం కోసం ఏం చేస్తున్నారో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల సుదీర్ఘ పనిగంటల పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నిరంతరాయంగా వారి చేత 36 గంటలు ఎలా పని చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితుల్లో వారు ఏకంగా 72 గంటలు ఏకబిగిన పనిచేస్తున్న విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. అసాధారణ పని గంటల నుంచి పీజీ వైద్య విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ, ‘నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులు 12 గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలకు మించి సేవలు అందించాల్సిన అవసరం లేదు. నిబంధనలకు అనుగుణంగా పనిగంటలు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వండి’ అని విన్నవించారు.


