
నిద్రమాత్రలు మింగుతున్న విజయమ్మ
పొదుపు సొమ్ము స్వాహా చేసిన వీఓఏను తప్పించిన అధికారులు
ఎమ్మెల్యేపై టీడీపీ నేతల ఒత్తిడి.. తిరిగి పాత వీఓఏనే నియామకం
ప్రశ్నించిన పాపానికి రెచ్చిపోయి కక్ష సాధింపులకు దిగిన నాయకులు
సెల్ఫీ వీడియోలో తన బాధ వివరిస్తూ నిద్ర మాత్రలు మింగిన బాధితురాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికార మదంతో గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. పొదుపు సంఘంలో సభ్యురాలైన ఓ దళిత మహిళను అసభ్యకరంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువుపాళెం ఎస్సీ కాలనీకి చెందిన దారా విజయమ్మను స్థానిక టీడీపీ నేతలు విక్రమ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు దుర్భాషలాడడంతోపాటు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగక ఆమెపై పోలీసు కేసు పెట్టించారు. పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎస్సై ద్వారా కూడా మందలించారు. దీంతో ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. ‘ఏ తప్పు చేయని నన్ను తోటపల్లిగూడూరు వెలుగు సీసీ కోసం ఇబ్బంది పెడుతున్నారు.
దొరువుపాళెం గ్రామానికి చెందిన సునీత అనే వీఓఏ.. మహిళల పొదుపు సొమ్ము సుమారు రూ.18 లక్షలు దుర్వినియోగం చేసింది. దీంతో ఆమెను తొలగించి, మా బంధువు దారా కోటేశ్వరమ్మను నియమించారు. అయితే కూటమి పార్టీకి చెందిన స్థానిక నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చి కోటేశ్వరమ్మను తొలగించారు. తిరిగి సునీతనే వీఓఏగా నియమించారు.
ఈ అన్యాయాన్ని నేను పలుమార్లు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నాపై టీడీపీ నాయకులు కక్ష కట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారు. అందుకే చనిపోవాలనుకుంటున్నా. నా చావుకు అధికార టీడీపీ నాయకులే కారణం’ అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో వివరిస్తూ నిద్ర మాత్రలు మింగారు. అనంతరం ఆమె కుప్పకూలిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.