
గంజాయి, మద్యం తాగి హత్యాయత్నం చేసిన వారిని వదిలేసి బాధితులపైనే ఎదురు కేసులు
జెడ్పీ చైర్‌పర్సన్ భర్త కారుతో ఢీకొట్టారంటూ టీడీపీ మహిళా నేత ఫిర్యాదు
ఆ కారు, డ్రైవర్‌ను సమకూర్చింది ప్రభుత్వమే.. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఉప్పాల రాముపై అక్రమ కేసు
తమపై హత్యాయత్నం జరిగిందని బీసీ మహిళ, జెడ్పీ చైర్‌పర్సన్ ఫిర్యాదు చేస్తే చిన్న చిన్న సెక్షన్లతో కేసులు
గుడివాడ రూరల్: బీసీ మహిళ, కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైఎస్సార్ సీపీ నేత ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాముపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ గూండాలు తిరిగి వారిపైనే అక్రమ కేసు బనాయించి మరో డ్రామాకు తెర తీశారు. నాగవరప్పాడు వద్ద జెడ్పీ చైర్‌పర్సన్ భర్త తనను కారుతో ఢీకొట్టి గాయపరిచారని, అందులో ఉన్న వైఎస్సార్ సీపీ నేత తనను దూషించారంటూ తెలుగు మహిళా నేత మాదాల సునీతతో సోమవారం గుడివాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. అయితే తమ కళ్లముందే దాడి చేసిన గూండాలను పోలీసులు వెనకేసుకు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్ పర్సన్ హారికకు ప్రభుత్వమే కారుతోపాటు డ్రైవర్‌ను కూడా సమకూర్చిందని, మహిళను ఢీకొట్టారన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గుడివాడలో ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో..’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శనివారం మధ్యాహ్నం నుంచే టీడీపీ నేతలు తీవ్రంగా యత్నించారు.
వివాదాస్పద పోస్టర్లు ఏర్పాటు చేయడమే కాకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రాకుండా సభకు వెళ్లే రహదారుల్లో గంజాయి, మద్యం తాగిన టీడీపీ కిరాయి గూండాలు కాపు గాసి వీరంగం సృష్టించారు. పచ్చ ముఠాలు తమ ఎదుటే జెడ్పీ చైర్ పర్సన్ కారును ధ్వంసం చేసి మారణాయుధాలతో సంచరించినా పోలీసులు స్పందించకుండా ప్రేక్షకపాత్ర వహించారు. హత్యాయత్నానికి పథకం వేసిన టీడీపీ గూండాలను అరెస్టు చేయకుండా మిన్నకుండిపోయారు. చిన్న చిన్న సెక్షన్ల కింద తూతూమంత్రంగా కేసులు నమోదు చేశారు.
బాబు, లోకేశ్ డైరెక్షన్‌లోనే..!
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్‌లోనే గుడివాడలో టీడీపీ కిరాయి గూండాలు అలజడి సృష్టించినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో మరో కొత్త డ్రామాకు తెర తీశారు. జెడ్పీ చైర్‌పర్సన్ భర్త తనను కారుతో ఢీకొట్టి గాయపరిచారని ఫిర్యాదు చేసిన తెలుగు మహిళా నేత మాదాల సునీతను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఫిర్యాదుపై మీనమేషాలు లెక్కించిన పోలీసులు.. సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఆగమేఘాలపై ఉప్పాల రాముతోపాటు మరికొందరు వైఎస్సార్‌సీపీ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైనా గతంలో టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. తిరిగి ఆయనపైనే అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన అసలు జిల్లాలోనే ఉండకూడదని పోలీసులు ఆదేశించారు. కోర్టు అనుమతి తీసుకుని స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమైనా పోలీసులు సహకరించడం లేదు. కేతిరెడ్డి లేకపోతే తాడిపత్రిలో తమ అరాచకాలకు అడ్డు ఉండదనేది టీడీపీ పన్నాగం. ఇక ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నెల్లూరు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపైనా నెల్లూరులో పచ్చముఠాలు ఓ పథకం ప్రకారం దాడికి తెగబడ్డాయి. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో చొరబడి 80 ఏళ్ల వయసున్న ఆయన మాతృమూర్తిని భయభ్రాంతులకు గురి చేసి విధ్వంస కాండకు దిగారు. తిరిగి ప్రసన్నకుమార్‌రెడ్డిపైనే కేసులు బనాయించారు.