పంచాయతీ కార్యదర్శుల ఉద్యమబాట | Gram Panchayat secretaries in the way of concern | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శుల ఉద్యమబాట

Jun 28 2025 4:36 AM | Updated on Jun 28 2025 4:36 AM

Gram Panchayat secretaries in the way of concern

నేడు రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడి సెలవు

తమ సమస్యలపై అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు 

ఉ.6 గంటలకే విధుల్లో పాల్గొంటున్నట్లు ఫొటోలు దిగి అప్‌లోడ్‌ చేయాలనడంపై నిరసన

గతంలో వలంటీర్ల సర్వే పనులూ తమకే చెబుతుండడంపైనా అభ్యంతరం

సమస్యలు పరిష్కారం కాకుంటే వచ్చేవారం విజయవాడలో మూడ్రోజుల ఆందోళన

సాక్షి, అమరావతి: రోజూ ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో విధులకు హాజరై ఆ రోజు దినపత్రికతో ఫొటో దిగి దానిని పంచాయతీ శాఖ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ శాఖ ఉన్నతాధికారులు మౌఖికంగా జారీచేసిన ఆదేశాలను నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద్యమబాట పట్టారు. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. ఇందుకోసం శనివారం రాష్ట్రంలోని అత్యధిక మండలాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. ఎంపీడీఓలకు శుక్రవారమే ఈ మేరకు వినతిపత్రాలు అందజేశారు. 

నిధులు నాస్తి.. పనిఒత్తిడి జాస్తి..
గ్రామ పంచాయతీల కోసం రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను నెలల తరబడి టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పంచాయతీలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో సర్పంచులు పారిశుద్ధ్య పనులు నిర్వహించలేక చేతులెత్తేస్తున్నారు. మరోవైపు.. పంచాయతీ కార్యదర్శులపై విపరీతమైన పని ఒత్తిడి పెడుతున్నారంటూ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు. 

గతంలో వలంటీర్లు చేసిన చిన్నచిన్న సర్వే పనుల భారమంతా పంచాయతీ కార్యదర్శులపై పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే, గ్రామాల్లో పారిశుధ్ధ్య పనుల్లో పాల్గొనే ‘క్లాప్‌’ మిత్రలు ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ.6 వేలకు పనిచేసేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితిలేదని.. పైగా ఆ మొత్తం వారికి సకాలంలో ఇచ్చేందుకు నిధుల కొరత కూడా ఉంటోందని చెబుతున్నారు. 

కొన్ని పంచాయతీల్లో ఆర్నెల్ల నుంచి ఏడాది కాలంగా క్లాప్‌ మిత్రలకు గౌరవ వేతనాలు ఇవ్వని పరిస్థితులున్నాయంటున్నారు. అంతేకాక.. తమకు జారీచేసిన ఆదేశాలు అవమానించేలా ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. పేపరు పట్టుకుని నిలబడి ఫొటోలు దిగాలనడం చూస్తుంటే తమను పని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని, తద్వారా మానసిక క్షోభకు గురవుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇలా అయితే కుటుంబాలకు దూరం..
ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఇలా విపరీతమైన పనిభారంతో పంచాయతీ కార్యదర్శులు తమ కుటుంబాల్ని మరిచిపోయే పరిస్థితి వస్తోందంటున్నారు. వలంటీర్ల వ్యవస్థ అటకెక్కిన తర్వాత పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్‌ శాఖ విధుల కంటే గ్రామ, వార్డు సచివాలయాల సర్వే పనులే ఎక్కువగా చేపట్టాల్సి వస్తోందని.. పైగా, ఏదైనా పొరపాటు జరిగితే వీరినే ముందుగా బాధ్యులను చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో.. తమ సమస్యలపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓ)లు, జెడ్పీ సీఈఓలకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు వారు చెప్పారు. అప్పటికీ  సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే వారం విజయవాడలో మూడురోజుల పాటు ఆందోళన చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉద్యోగ సంఘ నేతలు పేర్కొంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement