నేడు తిరుమలలో గరుడ వాహన సేవ | Sakshi
Sakshi News home page

నేడు తిరుమలలో గరుడ వాహన సేవ

Published Fri, Sep 22 2023 4:27 AM

Garuda vahana seva in Tirumala today - Sakshi

తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశిష్టౖమైన గరుడ వాహన సేవ శుక్రవారం రాత్రి 7 గంటలకే ఆరంభమవనుంది. ఈ సేవకు 2.5 లక్షల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశాలున్నాయి. గరుడ సేవను అర్థరాత్రి తర్వాత 3 గంటల వరకు నిర్వహించనున్నారు. గరుడ సేవ కారణంగా శుక్రవారం నుంచి తిరుమలకు వచ్చే రెండో ఘాట్‌రోడ్డులో ద్విచక్ర వాహనాలను అనుమతించేది లేదని టీటీడీ తెలిపింది.

కాగా, స్వామి ఊరేగే వాహనాలపై నాణేలు విసరవద్దని భక్తులకు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. భక్తులు విసిరే నాణేలు, మిరియాలు, ఉప్పు వంటి పదార్థాల వల్ల స్వామి వారికి అలంకరించే ఆభరణాలు విరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం నాడు ఉదయం కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలసి మలయప్ప పురవీధుల్లో వైభవంగా ఊరేగారు.

సాయం సంధ్యావేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకార సేవ కోసం కొలువు మంటపంలో వేంచేపు చేశారు. వేయి నేతి దీపాల వె లుగులో ఉత్సవమూర్తులు ఊయలపై ఊ గుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంత రం బంగారు, వజ్రవైఢూర్య ఆభరణాలతో ఉత్సవరులకు విశేష అలంకరణ చేశారు. రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి వారు వి హరించారు. ఈ వాహన సేవలో రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.  

శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు, చెన్నయ్‌ గొడుగులు 
తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి ధరించిన మాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. వీటిని శుక్రవారం శ్రీవారి వా హన సేవల్లో అలంకరిస్తారు. ద్వాపర యు గంలో గోదాదేవికి శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం మేరకు శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో వెలసిన గోదాదేవి ధరించిన మాలలు శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ. శ్రీవిల్లి పు త్తూరు నుంచి తిరుమలకు వచ్చిన మా లలు, చిలుకలను శ్రీవారి ఆలయానికి అందజేశా రు. హిందూ ధర్మార్థ ట్రస్ట్‌ సమితి(చెన్నై) నిర్వాహకులు ఆర్‌ఆర్‌ గోపాల్‌జీ.. తిరుమలేశునికి 9 కొత్త గొడుగులను సమర్పించారు.  

Advertisement
Advertisement