ప్రాణం తీసిన ఈత సరదా | Four children drown in pond | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Jun 5 2026 5:29 AM | Updated on Jun 5 2026 5:30 AM

Four children drown in pond

చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి  

ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో విషాదం 

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు 

వారిలో ఇద్దరు సొంత అన్నదమ్ములు

ఒంగోలు టౌన్‌: ఈత సరదా నలుగురు చిన్నారులను బలిగొంది. అప్పటివరకు ఉత్సాహంగా కేరింతలు కొట్టిన చిన్నారులు విగతజీవులుగా మారి.. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన కరేటి కల్యాణ చక్రవర్తి ఆర్‌ఎంపీగా పనిచేస్తుంటాడు. అతడి భార్య లక్ష్మి జానకి ఒంగోలులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. కల్యాణ చక్రవర్తి చెల్లెలు నాగరాజ భర్త పొదిలి రవి కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమారుడు చిన్నుతో కలిసి తల్లి దగ్గర ఉంటోంది. 

నాగరాజ కూడా ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తోంది. కల్యాణ చక్రవర్తి ఇద్దరు కుమారులైన అభిరామ్‌(14), సుశాంత్‌ (12), నాగరాజ కుమారుడు చిన్ను(11), ఎదురింట్లో ఉండే ఇల్లా మాలయ్య కుమారుడు దినేశ్‌ స్నేహితులు. గురువారం ఉదయం ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం కందులూరు డొంక చెరువులో ఈతకు వెళ్లి.. నలుగురూ మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనం సమయం అవుతున్నా పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊరంతా వెదికారు. చివరికి చెరువు గట్టు మీద పిల్లల దుస్తులు, చెప్పులు కనిపించాయి. 

ఈతకు దిగిన పిల్లలు చెరువులో గల్లంతైనట్లు భావించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల తర్వాత అభిరామ్, సుశాంత్, దినేశ్, చిన్ను మృతదేహాలు బయటపడ్డాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మరణించడంతో.. వారి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చెరువుకొమ్ముపాలెంలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయ విదారకమని.. బాధిత కుటుంబాల్లో నెలకొన్న విషాదం మాటల్లో వర్ణించలేనిదని అన్నారు. 

మృతి చెందిన చిన్నారుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ గారాలపట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిదని.. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement