బాబు గద్దెనెక్కాక ఏటా సేవల్లో తిరోగమనం
వైఎస్సార్‌సీపీ హయాంలో దిగ్విజయంగా పరుగులు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రెండులక్షలమందికిపైగా బాలింతలకు సేవలు
నేడు సర్వీసులను గాలికి వదిలేసిన సర్కారు
నిరుపేద బాలింతల కుటుంబాలపై ఆర్థిక భారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ఏటా తగ్గుముఖం పడుతున్నాయి. ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి న తల్లులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం లభించడం లేదు. దీంతో పసికందులతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీల్లో అష్టకష్టాలు పడుతూ బాలింతలు ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదికి 3 లక్షల మేర ప్రసవాలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా 2019 ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వం 279 అరకొర వాహనాలతోనే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు నడిపింది. దీంతో సొంత డబ్బు ఖర్చు పెట్టి బాలింతలు ఇళ్లకు చేరుకోవాల్సిన దుస్థితి అప్పట్లో ఉండేది.
ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్ నుంచి 500 వాహనాలతో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విస్తరించింది. ఏసీ కార్లను సేవల కోసం సమకూర్చడమే కాకుండా తల్లులు, బిడ్డల రక్షణ, భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం పెట్టారు. ఈ క్రమంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో ఒక్కసారి పురోగతి నమోదైంది. 2023లో ఏకంగా 2,16,256కు సేవలు పెరిగాయి. అంటే రోజుకు సగటున 600 మంది బాలితలు సేవలు పొందారు. ఇదిలా ఉండగా 2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పరిస్థితులు తారుమారయ్యాయి.
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా ఏటా సేవలు పెరగాల్సి ఉండగా, తగ్గుముఖం పడుతున్నాయి. 2023లో 2.16 లక్షల సేవలు నమోదవ్వగా, 2024లో 1.86 లక్షలకు పడిపోయాయి. 2025లో మరో 15 వేల మేర తగ్గి 1.71 వేల మందికే సేవలు అందాయి. ఈ లెక్కన పరిశీలిస్తే 2023లో రోజుకు 600 మందికి సేవలు అందగా, 2025లో 469కి ఆ సంఖ్య దిగజారింది. 2023లో జనవరి నుంచి మే మధ్య నెలకు 16 వేల నుంచి 19 వేల సేవలు ప్రభుత్వం అందించింది. ఇప్పుడు నెలకు 14వేల లోపు మాత్రమే సేవలు అందుతున్నాయని తెలుస్తోంది.
రూ. వందల నుంచి రూ. వేలల్లో భారం
చంద్రబాబు ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను గాలికి వదిలేయడంతో నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అనంతరం ఇళ్లకు కనిష్టంగా రూ.500 నుంచి దూరాన్ని బట్టి రూ. వేలల్లో సైతం బాలింతల కుటుంబ సభ్యులు ఖర్చు చేయాల్సి వస్తోంది. బాబు అధికారం చేపట్టిన వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా బాలింతలకు ఇచ్చే రూ. 5 వేల ఆరోగ్య ఆసరా సాయాన్ని నిలిపేశారు.
దీనికి తోడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్నీ నిర్లక్ష్యం చేయడంతో నిరుపేదలపై ఆర్థిక భారం పడుతోంది. గత ప్రభుత్వంలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలు, ఇబ్బందులపై ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ 104 ద్వారా ఫిర్యాదులను స్వీకరించేది. ఇప్పుడా ప్రత్యేక శ్రద్ధ లేకుండా పోయిందని బాలింతలు, గర్భిణులు మండిపడుతున్నారు.
నాడు సురక్షిత ఆలంబన
2022 జూన్ ఒకటో తేదీన విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఎస్.కె.అమీనాకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. ఆ కొద్దిసేపటికి 108 అంబులెన్స్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. విజయవాడ పాత జీజీహెచ్‌కు అమీనాను తరలించింది. వైద్యులు అమీనాకు ప్రసవం చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ంది. కొద్ది రోజులు విశ్రాంతి అనంతరం అదేనెల 11వ తేదీ ఆస్పత్రి నుంచి అమీనాను డిశ్చార్జి చేశారు. అమీనాది వైఎస్సార్ కడప జిల్లా కడప నగరం యానాది కాలనీ.
ఈ క్రమంలో ఇంటికి వెళ్లాలంటే 400 కిలోమీటర్ల మేర ప్రయాణం. తల్లీబిడ్డ రైలు, బస్సుల్లో వెళ్లడం కష్టంతో కూడుకున్న విషయం. ప్రైవేట్ ట్యాక్సీ అద్దెకు తీసుకుని వెళ్లాలంటే సుమారు రూ.10వేల మేర వెచ్చించాలి. ఇలాంటి పరిస్థితుల్లో అమీనాకు ‘డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం అండగా నిలిచింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాహనంలో అమీనా ఆమె బిడ్డను వైఎస్ జగన్ ప్రభుత్వం క్షేమంగా ఇంటికి చేర్చింది.
నేడు నరకయాతన
అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం మత్స్యపురం గ్రామానికి చెందిన చెందిన సుమిత్ర ఈ ఏడాది ఏప్రిల్ 19న కేజీహెచ్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తల్లీబిడ్డను ఇంటికి చేర్చడం కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం సమకూర్చాలని కేజీహెచ్ అధికారులను కోరారు. వాహనాలు అందుబాటులో లేవని, ఓ రోజు వేచి ఉండాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక అష్టకష్టాలు పడి ఆర్డీసీ బస్టాండ్‌కు, అక్కడి నుంచి బస్‌లో మత్స్యపురానికి రోజుల బిడ్డతో బాలింత సుమిత్రను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకుని వెళ్లారు.
నాడు వైఎస్ జగన్ సంక్షేమ శకానికి, నేడు చంద్రబాబు చీకటి పాలనకు ఈ రెండు ఘటనలే నిదర్శనం.


