ఇది ప్రజాస్వామ్యమా.. నిరంకుశత్వమా!? | Farmers grievances with land acquisition officials at Guntur Collectorate | Sakshi
Sakshi News home page

ఇది ప్రజాస్వామ్యమా.. నిరంకుశత్వమా!?

Jun 28 2026 5:14 AM | Updated on Jun 28 2026 5:15 AM

Farmers grievances with land acquisition officials at Guntur Collectorate

ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో ప్రభుత్వ నాటకాలు సహించం 

ముఖ్యమంత్రి ఇంటికి ఐదెకరాల భూమి కావాలా? 

మా భూముల్లో వ్యాపారం చేస్తామంటే ఇచ్చేదిలేదు 

ఈ ప్రభుత్వం మా కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది 

అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం 

దేశంలో ఎక్కడైనా ఇలాంటి వ్యవహారం నడుస్తుందా? 

చంద్రబాబు అరాచకంపై జనసేన, బీజేపీ ప్రశ్నించకపోవడం దారుణం 

గుంటూరు కలెక్టరేట్‌లో భూసేకరణ అధికారులతో ఉండవల్లి రైతుల ఆవేదన 

సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్‌: భూసేకరణ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకాలు సహించేది లేదని గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ రైతులు తేల్చిచెప్పారు. పది మందికి అన్నం పెట్టే రైతుల భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకుని ప్రభుత్వం కార్పొరేట్‌ రంగానికి దోచిపెడుతుందని మండిపడ్డారు. నలుగురు ఉండే చంద్రబాబు కుటుంబానికి పచ్చని ఐదెకరాల భూమి అవసరమా? అని సూటిగా  ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశ పాలనా అంటూ దుమ్మెత్తి పోశారు. 

ఇప్పటివరకు అవసరమైన రోడ్లకు, వాగులకు భూములను స్వచ్ఛందంగా ఇచ్చామని.. ఇంకా మా భూముల్లో వ్యాపారం చేస్తామంటే ఇచ్చేదిలేదని వారు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులకు సీఆర్‌డీఏ నుంచి అందిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శనివారం గుంటూరు కలెక్టరేట్‌లో సీఆర్‌డీఏ డెప్యూటీ కలెక్టర్‌ మధుసూదనరావును కలిశారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. 

భూములను పిల్లలకిచ్చేశామయ్యా..  
నాకు 1.60 ఎకరాల భూమి ఉంది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లళ్ల సమయంలో పిల్లలకిచ్చేశాం. ఇప్పుడేమో ప్రభుత్వం బలవంతపు భూసేకరణంటూ ఇబ్బందులు పెడుతోంది. పిల్లలకిచ్చి న భూమిని వారి అనుమతిలేకుండా ప్రభుత్వానికి ఎలా ఇవ్వగలం. ఈ ప్రభుత్వం మా కుటుంబాల్లో చిచ్చుపెడుతోంది. మా అనుమతులు లేకుండా భూములు తీసుకునే హక్కు ఎవరిచ్చారు? భగవంతుడ్నే నమ్ముకున్నాం. – ఎం.రమాదేవి, ఉండవల్లి రైతు 

చంద్రబాబు నివాసానికి ఐదు ఎకరాలా!?.. 
ఎంతో విలువైన రైతుల భూముల్ని తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదెకరాల్లో ఇల్లు నిర్మించుకోవడం అవసరమా? భూసేకరణలో కనీస నిబంధనలే కాదు, విధి విధానాలు కూడా పాటించడంలేదు. రైల్వేలో టీసీ ఉద్యోగం వదిలేసి 1995 నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇది నాకు ప్రాణ సమానం. భూమికి మరణం ఉండదు. మా చివరి శ్వాస వరకు నా భూమిని ఎవ్వరీకీ ఇచ్చేదిలేదు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధం.  – రఘునాథరెడ్డి, రైతు 

రైతుల అభిప్రాయాలకు విలువేది?.. 
నేను చిన్న రైతును. నాకు 95 సెంట్ల భూమి ఉంది. ఇందులో 25 సెంట్లు కుమార్తె వివాహ సమయంలో ఇచ్చేశాను. మిగతా భూమిలో గేదెలు, ఆవులు పెట్టుకుని, కూరగాయలు పండించుకుని జీవిస్తున్నా. కొండవీటి వాగు పక్కనే నా భూమి ఉంది. ప్రభుత్వ అవసరాలైన రోడ్డు, కాలువలకు భూమి ఇవ్వడానికి సిద్ధమే. మా భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తామంటే ఒప్పుకునేది లేదు. – తక్కెళ్లపాటి బక్కిరెడ్డి, రైతు 

అధికారులు వివరాలు ఇవ్వడంలేదు.. 
మా భూములు కావాలంటున్న సీఆర్‌డీఏ అధికారులు కనీసం అడిగిన వివరాలు కూడా చెప్పడంలేదు. వారు మా అభిప్రాయా­న్ని తెలుసుకోవడం కంటే ప్రభుత్వ నిర్ణయం అమలుచేయడమే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారు. నాకున్న 1.18 ఎకరాల భూమే నాకు ఆధారం. మొత్తం పూలింగ్‌కు ఇమ్మంటే  ఏమైపోవాలి? – ఝాన్సీరెడ్డి, రైతు 

క్యాన్సర్‌ రోగితో ప్రభుత్వం ఆడుకుంటోంది.. 
కొన్నినెలలుగా నిద్రపోతే ఒట్టు. ఒకపక్క బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నా. మరోపక్క ప్రభుత్వ వేధింపులతో తల్లడిల్లుతున్నా. మా భూములపై మాకు హక్కులుండవా.. ఇదేం న్యాయం?  కూటమి ప్రభుత్వంలో ఇంతటి అన్యాయం చేస్తారని అనుకోలేదు. ప్రభుత్వం మా ఉసురుపోసుకుంటుంది. – జి. శివకుమారి, రైతు  

కుటుంబంలో గొడవులవుతున్నాయి.. 
నాకున్న ఎకరం భూమి ఇద్దరు అమ్మాయిలకు వివాహ సమయంలోనే ఇచ్చేశాను. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటుందంటే అల్లుళ్లు ఊరుకుంటారా? ఈ వయస్సులో ఈ టెన్షన్‌ ఏంటో తెలీడంలేదు.  – ఆర్‌. విజయలక్ష్మి, రైతు 

చంద్రబాబుకు భూదాహం.. 
చంద్రబాబుకు భూదాహం. అందుకే రైతులకు చెందిన వేల ఎక­రాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు అరా­చకంపై కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ కనీసం ప్రశ్నించకపోవడం ధారుణం. రైతుల తరఫున రాజీలేని పోరాటంతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమే. – మున్నంగి వీర శ్రీధర్‌రెడ్డి, రైతు

ఇంకెన్ని వేల ఎకరాలు తీసుకుంటారు?
రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక విధానాలతో, బలవంతంగా రాజధాని ప్రాంతంలోని భూములను రైతుల నుంచి తీసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని ఉపేక్షించేది లేదు. బెదిరించి భూములు లాక్కోవాలని చూస్తే భయపడేది లేదు. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలకు పైగా భూమి ప్రభుత్వం చేతిలో ఉంది., ఇంకెన్ని వేల ఎకరాలు తీసుకుంటారు?  – డాక్టర్‌ కన్నారావు నాయుడు, ఉండవల్లి రైతు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement