విశాఖ ఎయిర్‌పోర్టుకు వీడ్కోలు | Farewell to Visakhapatnam Airport | Sakshi
Sakshi News home page

విశాఖ ఎయిర్‌పోర్టుకు వీడ్కోలు

Aug 17 2026 5:48 AM | Updated on Aug 17 2026 5:48 AM

Farewell to Visakhapatnam Airport

ప్రయాణికులకు, సిబ్బందికి స్వీట్స్‌ పంచిపెడుతున్న ఏపీ ఎయిర్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

విమానాశ్రయ సేవలకు కృతజ్ఞతా వీడ్కోలు కార్యక్రమం నిర్వహణ 

ఆదివారం అర్ధరాత్రితో నిలిచిపోయిన సేవలు 

సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ఎయిర్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌

సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయ సేవలు ఆదివారంతో ముగిశాయి. వాణిజ్య విమాన రాకపోకలు నేటితో భోగాపురానికి బదిలీ అయ్యాయని.. సింగపూర్, దుబాయ్‌ వంటి అంతర్జాతీయ సర్వీసులతో పాటు సముద్ర ఉత్పత్తుల కార్గో సేవలను విజయవంతంగా నడిపిన విశాఖ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి దశాబ్దాలుగా సహకరించిన ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఎయిర్‌లైన్స్‌ భద్రతా సిబ్బందికి ఏపీ ఎయిర్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎయిర్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ వీడ్కోలు వేడుకల్ని ఎయిర్‌పోర్టులో ఆదివారం నిర్వహించింది.

అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి కీలకంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కొత్త ఎయిర్‌పోర్టు ద్వారా దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడమే కాక పర్యాటకం, ఐటీ, డేటా సెంటర్లు, ఫార్మాస్యూటికల్స్, మత్స్య ఎగుమతులు, ఉపాధి కల్పనకు భారీగా అవకాశాలు వస్తాయని అసోసియేషన్‌ ప్రతినిధులు కుమార్‌రాజా, డీఎస్‌ వర్మ, నరేష్ కుమార్‌ పేర్కొన్నారు. విశాఖ నగరం మధ్యలో ఉండటంవల్ల ఎదుర్కొన్న రక్షణపరమైన పరిమితులను అధిగమించి, రాబోయే 50 ఏళ్ల విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అవసరాలను తీర్చే సామర్థ్యం 
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సొంతమన్నారు.  

45 నిమిషాల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి.. 
భోగాపురం ఎయిర్‌పోర్టు విజయవంతం కావాలంటే విశాఖ నగరంతో వేగవంతమైన, అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండేలా రవాణా సదుపాయాలు అత్యంత కీలకమని అసోసియేషన్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 45 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా కోస్టల్‌ కారిడార్‌ పనులను వేగవంతం చేయాలని, హై–ఫ్రీక్వెన్సీ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు, భవిష్యత్‌ అవసరాల కోసం ముందస్తుగానే మెట్రో లేదా రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌కు ప్రణాళిక చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్కే బీచ్, వుడా పార్క్, సీతమ్మధార మొదలైన ప్రధాన ప్రాంతాల్లో జీఎంఆర్‌ సంస్థ ‘సిటీ పాసింజర్‌ లాంజ్‌లు ఏర్పాటుచేయాలని వారు కోరారు. అదేవిధంగా.. విశాఖకు చెందిన ఫార్మా, సీఫుడ్‌ ఎగుమతులు హైదరాబాద్, చెన్నైకి తరలిపోకుండా వెంటనే భోగాపురంలో డెడికేటెడ్‌ కార్గో టెర్మీనల్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement