ఈ గోపాలుడి లీలలు వేరయా.. | Fake ACB CI Officer Hulchul In Vishakha | Sakshi
Sakshi News home page

ఈ గోపాలుడి లీలలు వేరయా..

May 29 2025 11:52 AM | Updated on May 29 2025 12:59 PM

Fake ACB CI Officer Hulchul In Vishakha

నకిలీ ఏసీబీ సీఐ వెనుక ఓ సంస్థ చైర్మన్‌

ఇద్దరూ కలిసి విమానాల్లో యాత్రలు

హనీట్రాప్‌ ద్వారా భారీగా వసూళ్లు 

పలువురు అధికారులకూ బెదిరింపులు

 పోలీసులతో కలిసి విందు వినోదాలు

 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సీఐ పేరుతో బెదిరిస్తూ వసూళ్లకు దిగి ఊచలు లెక్కిస్తున్న సుధాకర్‌కు తెలుగుదేశం నేత, ఓ సంస్థ చైర్మన్‌తో సత్సంబంధాలు కలిగి ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరూ కలిసి విమానాల్లో పలుమార్లు గోవా, బ్యాంకాక్‌ లాంటి ట్రిప్పులకు వెళ్లినట్టు కూడా తెలుస్తోంది. తాను ఏసీబీ సీఐ అని పరిచయం చేసుకుంటూ.. మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన వ్యవహారంలో టీడీపీ నేత బలగ సుధాకర్‌ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ కూడా ఊచలు లెక్కబెడుతున్నారు.

 అయితే, అసలు మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పిన గోపాలుడు మరొకరు ఉన్నట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఓ ప్రభుత్వ సంస్థ చైర్మన్‌ హోదాలో అధికారం చెలాయిస్తున్నట్టు సమాచారం. నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్‌తో సదరు చైర్మన్‌ ఎంతో అన్యోన్యంగా గోవా, బ్యాంకాక్‌ వంటి ట్రిప్పులకు వెళుతూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలు తెలుగుదేశం పార్టీ అంతర్గత గ్రూపుల్లోనూ సర్క్యులేట్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సదరు సుధాకర్‌కు పలువురు పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోనూ పరిచయాలు ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో నగర శివారులోని రిసార్టుల్లో పలువురితో ఉన్న ఫొటోలు కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాకుండా అందమైన అమ్మాయిల ద్వారా పలువురు నేతలు, అధికారులతో అన్యోన్యంగా మాట్లాడిన ఆడియోలు, వీడియోలు రికార్డు చేసి హనీట్రాప్‌ ద్వారా లక్షలు గుంజినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే సదరు చైర్మన్‌తో పాటు ఇతర వ్యక్తుల పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.  

అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర 
చినబాబుతో తనకు మాత్రమే సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ అధికారం చెలాయిస్తున్న సదరు నేతపై టీడీపీ నేతలే గుర్రుగా ఉన్నారు. వివిధ ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా.. మాట చెల్లుబాటు చేసుకుంటుండంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా నియోజకవర్గాలతో సంబంధం లేకుండా అన్నింటిలోనూ తలదూర్చుతుండటం కూడా ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు ఈ నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో సదరు చైర్మన్‌పై పలువురు నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

నేరుగా టీడీపీ అధిష్టానం దృష్టికి ఇద్దరూ చనువుగా ఉన్న ఫొటోలను పంపి మరీ బాగోతాన్ని వెలికితీయాలని కోరినట్టు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ఇక సదరు సంస్థలో కూడా ఇష్టారీతిలో ప్రవర్తిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులను కేటాయిస్తూ దండుకుంటున్న విషయాన్ని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మొత్తంగా నకిలీ ఏసీబీ సీఐ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

అన్ని శాఖల్లోనూ వసూళ్లు 
నకిలీ ఏసీబీ సీఐ సుధాకర్‌.. అధికార పారీ్టకి చెందిన నేత, ఇతర పోలీసుల అండదండలు చూసుకుని రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. సబ్‌ రిజిస్ట్రార్లు, రవాణాశాఖ, రెవెన్యూ, విద్యుత్‌ శాఖతో పాటు రాజకీయ పారీ్టల నేతలనూ బెదిరించి భారీగా వసూళ్లకు తెగబడినట్టు తెలుస్తోంది. ఏసీబీ పేరుతో పలువురు అధికారుల నుంచి లక్షల్లో గుంజుకున్నట్టు సమాచారం. వీరెవ్వరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు మాత్రం రావడం లేదు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే తమ మీద కూడా కేసు నమోదవుతుందనే భయమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. 

ప్రధానంగా పలువురు సబ్‌ రిజిస్ట్రార్ల వద్ద లక్షల్లో వసూలు చేశారని తెలుస్తోంది. ఇక రెవెన్యూ శాఖలో కూడా భూలావాదేవీల్లో దండుకుంటున్న అధికారులను గుర్తించి టార్గెట్లు ఇచ్చి మరీ వసూలు చేశారనే ప్రచారం ఉంది. ఇక రవాణాశాఖలో కూడా కొద్ది మంది వద్ద లక్షల్లో వసూలు చేశారని సమాచారం. ఇక కొద్ది మంది నేతలు, అధికారులతో తమ బ్యాచ్‌లో ఉన్న మహిళల ద్వారా చనువుగా మాట్లాడించి.. ఆ మాటలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌ చేసి వసూళ్లకు తెగబడ్డారనే పేరుంది. 

ఒక విధంగా హనీట్రాప్‌కు పాల్పడ్డారని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. ఈ విధంగా భారీగా దండుకున్న సొమ్ముతో సదరు బ్యాచ్‌ జల్సాలు చేసేవారు. ప్రధానంగా గోవా, బ్యాంకాక్‌ వంటి ట్రిప్పులకు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరందరూ విమానాశ్రయాల్లో దిగిన ఫొటోలను ఇప్పు డు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement