
అందులో అంగన్‌వాడీ పిల్లలు కూడా ఉంటారని వ్యాఖ్య
ఆ వెబ్‌సైట్‌లో 1–12 తరగతుల విద్యార్థుల వివరాలు మాత్రమే
ప్రతిపక్షంపై బురదజల్లడానికి నోటికొచ్చినట్లు మాట్లాడిన మంత్రి
లోకేశ్ సంగతి తెలిసిందే కదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్
సాక్షి, అమరావతి : ‘ప్రజా జీవితంలో ఉండేవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతైనా తెలుసుకోవాలి, లేదా అన్నీ తెలిసిన వారిని పక్కన పెట్టుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తెలిసిన వారు చెప్పింది విని అర్థం చేసుకుని మాట్లాడాలి. వీటిలో ఏ ఒక్కటీ చేయని వ్యక్తి కీలక విద్యా శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టం’ అని విద్యా రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో.. వాటిలో ఎంత మంది విద్యార్థులున్నారో తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి నవ్వుల పాలవడం లోకేశ్‌కు కొత్తేం కాదని ప్రజలు అంటున్నారు.
శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. యూడైస్‌పై మాట్లాడిన తీరు చూస్తుంటే విద్యా రంగంపై ఆయనకు కనీస అవగాహన లేదని స్పష్టమైందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘యూడైస్ ప్లస్’లో అంగన్‌వాడీ పిల్లలను కూడా లెక్కిస్తారని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శించారంటున్నారు. ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’.. సంక్షిప్తంగా యూడైస్ ప్లస్‌గా పేర్కొనే వెబ్‌సైట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.
యూడైస్‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయుల డేటాను ఏటా అప్‌లోడ్ చేస్తారని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇందులో నమోదు చేసే వివరాలన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించిన తర్వాతే అప్‌లోడ్ చేస్తారు. చిల్లరమల్లర వివరాలను ఇందులో నమోదు చేయరు. పైగా అన్ని వివరాలను ఒకటికి పదిసార్లు పరిశీలించిన తర్వాతే డేటాను నమోదు చేస్తారు.
ప్రతి విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (1–12) వరకు చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయని, అంగన్‌వాడీ పిల్లల వివరాలు నమోదు చేయలేదని యూడైస్ ప్లస్ నివేదికలోనే పేర్కొన్నారు. కావాలంటే రిపోర్టులోని పేజీ నంబర్ 10లో చూస్తే అవగాహన వస్తుందంటున్నారు. యూడైస్ ప్లస్ డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ మేనేజ్‌మెంట్ పాఠశాలలు 61,373 ఉన్నాయి.
వీటిలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ వివరాలు ఇదే రిపోర్టులోని 30వ పేజీలో ఉంది. ఈ కనీస వివరాలు కనుక్కోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం మంత్రిగా తగదని, అయినా లోకేశ్ సంగతి తెలిసిందే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
లోకేశ్ సెల్ఫ్ గోల్
విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు పరిపక్వత లేదు. నన్ను విమర్శించే స్థాయి అంతకంటే లేదు. యూడైస్ డేటాను తెలుసుకోవడానికి వంద రోజుల సమయం పట్టిందంటే ఆయనకు ఏ మాత్రం జ్ఞానం ఉందో అర్థమవుతోంది. పదో తరగతి పేపర్ల మూల్యాంకనం తప్పుల తడకగా నిర్వహించినప్పుడే విద్య శాఖ మంత్రిగా లోకేశ్ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు యూడైస్ డేటా పేరుతో ప్రతిపక్షంపై బురద చల్లాలని సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు.
యూడైస్ డేటాను కలెక్టర్లు స్వయంగా ఆమోదిస్తారు. ఏ లెక్కలు పడితే.. అవి ఇందులో చేర్చడానికి కుదరదు. ఇంగిత జ్ఞానం లేని లోకేశ్‌కు ఈ విషయాలు ఏమీ తెలియవు. అసలు లోకేశ్‌ను కాదు.. ఆయన్ను విద్య శాఖ మంత్రిని చేసిన చంద్రబాబును అనాలి. కొడుకుపై ప్రేమ ఉంటే ఇంకేమైనా చేసుకోవాలి గానీ విద్యార్థులపై బలవంతంగా రుద్దడం దురదృష్టకరం. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రి
నీ బుద్ధి గడ్డి తినిందా లోకేశ్?
లోకేశ్‌కు ఏపాటి అక్షర జ్ఞానం ఉందో దేశం మొత్తానికి తెలుసు. ఏడాది కాలంలో విద్యా శాఖను భ్రష్టు పట్టించారు. ఎక్కడైనా అంగన్‌వాడీ పిల్లలను యూడైస్‌లో నమోదు చేస్తారా? నువ్వు మంత్రివా? చదువు సంధ్యలు సరిగా అబ్బలేదు. కనీసం ప్రెస్‌మీట్‌కు వచ్చే ముందైనా నీ అధికారులను అడిగితే చెబుతారు కదా!
తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.2 వేలు కోత పెడుతున్నావు? దీనిపై గతంలో నువ్వు విమర్శలు చేయలేదా? ఇప్పుడు నీ బుద్ధి గడ్డి తింటోందా? కలెక్టర్ స్వయంగా ఆమోదించిన డేటాలో తప్పులు ఉన్నాయని ఎలా అంటావు? సరే.. ఒక్కటైనా నిరూపించావా? – ఆదిమూలపు సురేశ్,రాష్ట్ర విద్యా శాఖ మాజీ మంత్రి