స్కీములు రద్దు.. స్కామ్‌లే ముద్దు! | Economic devastation during ChandraBabu two year rule | Sakshi
Sakshi News home page

స్కీములు రద్దు.. స్కామ్‌లే ముద్దు!

Jun 13 2026 5:02 AM | Updated on Jun 13 2026 5:02 AM

Economic devastation during ChandraBabu two year rule

రెండేళ్ల బాబు పాలనలో అంతా ఆర్ధిక విధ్వంసం.. ఆస్తుల అమ్మకం 

దొంగే.. దొంగ దొంగ! అని అరిచినట్లుగా చంద్రబాబు ప్రవచనాలు 

రాష్ట్ర ఖజానానే ప్రైవేట్‌కు తాకట్టు పెట్టిన ఘనుడు బాబు 

సంపద సృష్టించకపోగా కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రైవేట్‌ పరం.. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి యువతకు, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలకు వెన్నుపోటు 

రెండేళ్లలోనే రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేసిన బాబు సర్కార్‌ 

ఇంత అప్పులు చేసినా సూపర్‌ సిక్స్‌లు లేవు.. హామీల అమలు లేదు 

నమ్మి ఓట్లేసిన ప్రజలకు మోసాలు, వెన్నుపోటు, ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా బాబు పాలన 

సాక్షి, అమరావతి: గతంలో ఉన్న పథకాలన్నీ రద్దు.. సూపర్‌ సిక్స్‌లు, సెవెన్లు పేరుతో మోసాలు! కొత్తగా సంపద సృష్టించకపోగా ఉన్న సంపదే ఆవిరి! విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం..! విప్లవాత్మక కార్యక్రమాలు, వ్యవస్థలకు మంగళం! పిల్లల నుంచి మహిళలు వరకు ప్రతి ఒక్కరికీ ఎడాపెడా ఎన్నికల హామీలిచ్చి నిస్సిగ్గుగా నయవంచన! ఇదీ రెండేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు సాధించిన ఘనత!! రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఉచిత పంటల బీమా ఎగిరిపోయి వ్యవసాయం కుదేలు కాగా విద్యాదీవెన, వసతి దీవెన అందక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకుండా తొక్కిపెట్టడంతో పిల్లల చదువులు ఆగిపోతున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు పనులను నిలిపివేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడమే ఆలస్యం.. ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి పిల్లల చదువులను గాలికి వదిలేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ఆరోగ్యశ్రీ­ని నీరుగార్చి బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవ­లు అందక పేదలు అల్లా­డు­తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవే­ట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు.  సచివాలయాల వ్యవస్థను ఛి­ద్రం చేస్తూ ఇంటి వద్దకే పౌరసేవ­లు, పాలన వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. రెండేళ్లలో అంతా స్కామ్‌ల మయంగా మార్చేశారు! 

హామీలు ఎగ్గొట్టి.. విచ్చలవిడిగా అప్పులు.. ప్రకృతి వనరుల దోపిడీ.. 
ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. సంపద సృష్టించి సంక్షేమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికి ఇప్పుడు ఉన్న సంపదనే ఊడ్చేస్తున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడంతో చంద్రబాబు పాలనలో ఆర్థిక ప్రతిష్ట దిగజారినట్లు ‘కాగ్‌’ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక సాక్షిగా వెల్లడైంది. 365 రోజుల్లో 357 రోజులు అప్పులపైనే చంద్రబాబు సర్కారు మనుగడ సాగించినట్లు ‘కాగ్‌’ నివేదిక స్పష్టం చేసింది. 

ప్రభుత్వ, స్థానిక సంస్ధల ఆస్తులను తాకట్టు పెట్టి బడ్జెట్‌ లోపల, బడ్టెట్‌ బయట చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.3.47 లక్షల కోట్లు మేర అప్పులు చేసింది. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్‌ వ్యక్తులకు తాకట్టు పెట్టేయడంతో పాటు ఎడాపెడా అప్పులతో ఆర్ధిక విధ్వంసం సృష్టించారు. ప్రజల తలసరి ఆదాయం,  ప్రభుత్వ రాబడిని పెంచకుండా ఇసుక నుంచి మద్యం దాకా సిలికా నుంచి లేటరైట్‌ వరకు ప్రకృతి వనరుల దోపిడీకి తెర తీసి పచ్చ ముఠాలకు పంచి పెట్టారు. విలువైన ప్రభుత్వ భూములను బంధు గణానికి అప్పనంగా దోచి పెట్టారు. సొంత కుటుంబ సంస్థకు రాయితీల పేరుతో ప్రజా ధనాన్ని మళ్లించారు. 

విచ్చలవిడిగా అప్పులు చేసినా సూపర్‌ సిక్స్, సెవెన్, ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి అమలు చేయకుండా యువతకు.. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు రెండేళ్ల పాలన నమ్మక ద్రోహం, మోసం, వెన్నుపోట్లు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే లక్ష్యంగా సాగింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన సభలో దొంగే.. దొంగ దొంగ..! అని అరిచినట్లుగా చంద్రబాబు సూక్తులను విని రాష్ట్ర ప్రజలు విస్తుపోయారు. రెండేళ్ల పాలనలో తన నిర్వాకాలను వైఎస్సార్‌ సీపీకి ఆపాదిస్తూ నిస్సిగ్గుగా నిందలు  మోపారు. 

రెండేళ్ల నమ్మకం అంటూ కూటమి ప్రభుత్వం సభ నిర్వహించడంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. సూపర్‌ సిక్స్‌లతో సహా ఎన్నికల హామీలను నెరవేర్చకపోగా.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను సైతం రద్దు చేసిన సీఎం చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ‘నమ్మకం’ పేరుతో సభ నిర్వహిస్తారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేసి నిజాయతీ నిరూపించుకున్నామంటూ చంద్రబాబు చెప్పడంపై నివ్వెరపోతున్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్‌ లాంటి అనేక హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయకుండా సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకోవడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందని, నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా వంచించారని సర్వత్రా చర్చ జరుగుతోంది. 

మద్యం ఆదాయాన్నీ వదలకుండా.. 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్‌బీసీఎల్‌ నుంచి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి బాండ్లు జారీ ద్వారా భారీ అప్పులు చేసింది. 2025 డిసెంబర్‌లో ఏపీఎస్‌బీసీఎల్‌ ద్వారా బాండ్లు జారీ చేసి రూ.5,750 కోట్లు అప్పు చేయగా ఇటీవల కేబినెట్‌ సమావేశంలో ఈ మొత్తాన్ని రూ.11,850 కోట్లకు పెంచారు. ఇలాంటి అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం, కాగ్‌ వారించినా  చంద్రబాబు ఖాతరు చేయలేదు.  

రాజధాని ముసుగులో.. 
రాజధాని నిర్మాణం పేరుతో భూములను తాకట్టు పెట్టడం ద్వారా భారీగా అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టించేవారే సంక్షేమం గురించి మాట్లాడాలని.. ఆదాయం పెంచేవాళ్లకే సంక్షేమం పంచే అధికారం ఉంటుందంటూ ఎన్నికల ముందు గంభీరంగా చెప్పిన చంద్రబాబు ఇప్పటికే ఉన్న ఆస్తులను సైతం కరిగించేస్తున్నారు. మరోవైపు తాను ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలను సైతం నిలిపి­వేశారు. సంపద సృష్టించకుండా, హామీలు అమలు చేయకుండానే నెరవేర్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతుండటం పట్ల అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. 

ప్రైవేట్‌ చేతికి ఖజానా తాళాలు! 
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా అప్పులను రికవరీ చేసుకునే వెసులుబాటు ప్రైవేట్‌ వ్యక్తులకు కల్పించింది. ఏపీఎండీసీకి రూ. 1,91,000 కోట్ల విలువైన 436 మైనింగ్‌ లీజులను బదిలీ చేసి వాటిని సెక్యురిటీగా బాండ్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేసింది. ఆ అప్పులకు గ్యారెంటీ ఇవ్వడమే కాకుండా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా అప్పులను రికవరీ చేసుకునే వెసులుబాటును  కల్పించింది. 

రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి వసూలు చేసుకునేలా అనుమతించింది. ఇంత దారుణంగా ఆర్ధిక విధ్వంసానికి తెగబడి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందంటూ రెండేళ్ల సభలో చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలాడ­టాన్ని చూసి అధికార యంత్రాంగం సైతం విస్తుపోయింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఎమ్మా­ర్వో ఆఫీసులను, ఆస్పత్రులను తాకట్టు పెట్టినట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లించారు. 

వాస్తవానికి వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో ఒకేసారి 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను చేపట్టగా వాటిని ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు ప్రభుత్వమే. అలాగే పౌర సేవలను ప్రైవేట్‌ పరం చేయాలని, మున్సిపల్‌ ఆస్తులను ప్రైవేట్‌ సంçస్థలు, వ్యక్తులకు దీర్ఘకాలిక లీజుకు లేదా విక్రయించేందుకు అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement