
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి మైసూరు తరువాత ఒంగోలు కళారాల ప్రత్యేకత
తొలిసారిగా పంచలోహ కనకదుర్గ కళారం ఊరేగింపు
ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తజనం
మేళతాళాలతో అమ్మవారి వేషధారణలో కళాకారుల నృత్య ప్రదర్శన
శక్తిరూపిణి అయిన ఆదిపరాశక్తి దానవ సంహారానికి కాళికామాత అవతారం దాల్చి భక్తుల కోరిక మేరకు తన ప్రతిరూపంగా ఇచ్చినట్లు భావించే కళారాలు దుర్గాష్టమి, మహార్నవమి రోజుల్లో ఒంగోలు పురవీధుల్లో దర్శనమిస్తాయి. దసరా ఉత్సవాల్లో ప్రకాశం జిల్లాకు ప్రత్యేకమైన ఈ కళారాల ఊరేగింపు.. వాటి విశిష్టత తెలుసుకుందాం
ఒంగోలు మెట్రో: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రోజుకొక అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో అర్ధరాత్రి పూట జరిగే కళారాల వేడుకలకు జిల్లా నలు వైపుల నుంచి ప్రజలు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో వారి మొక్కులు తీర్చుకుంటారు. దసరా నవరాత్రుల్లో ముఖ్యమైన దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి రోజున కళారాల ఊరేగింపు, నగరంలోని వివిధ దేవాలయాల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపునకు పారువేట వేడుకలకు ఒంగోలు నగరం ముస్తాబైంది. మంగళవారం మూడు కళారాలు ఊరేగించనుండగా, బుధవారం మరో మూడు కళారాలకు నగరోత్సవం నిర్వహించనున్నారు. మైసూర్ తర్వాత ఒంగోలుకే ఈ కళారాల ఉత్సవం ప్రత్యేకం.
వందలేళ్ల నాటి చరిత్ర
ఒంగోలులో జరిగే కళారాల ఉత్సవానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పట్లో చిన్న గూడు బండ్లు కట్టుకొని అమ్మవారి కళారాన్ని ఊరేగిస్తూ తప్పెట్లు వాయిస్తూ కాగడాలు పట్టుకొని అర్ధరాత్రి నుంచి నగరం మొత్తం తిరిగేవారు. తెల్లవారే వరకు ఈ సందడి కొనసాగేది. ఎంత రాత్రి అయినా సరే తమ వీధిలోకి వస్తున్న కళారాన్ని చూసి అమ్మవారికి హారతులు సమరి్పంచి ఆశీస్సులు అందుకునేవారు. ఇప్పటి కాలంతోపాటు ఉత్సవ తీరులోనూ ఆధునికత చోటు చేసుకుంది. అదిరిపోయే డీజే, బాణసంచా శబ్దాలతో దేవాలయాల నుంచి వీధుల్లోకి ఊరేగింపుగా వచ్చే అమ్మవారి కళారాన్ని దర్శిస్తే మళ్లీ ఏడాది వరకు ఎలాంటి దుష్ట శక్తుల పీడ, ఈతి బాధలు ఉండవని భక్తుల నమ్మకం.
భక్తుల కొంగుబంగారం ఆరు కళారాలు...
ఒంగోలు మొత్తం ఆరు కళారాలు ఉన్నాయి. స్థానిక బాలాజీరావుపేటలో కనకదుర్గాదేవి, గంటపాలెంలో పార్వతీదేవి, కొత్తపట్నం బస్టాండ్ నల్లూరి నర్సింగ్ హోమ్ దగ్గర బాలా త్రిపుర సుందరీ దేవి, నరసింహస్వామి, ఏనుగు చెట్టు దగ్గర ఉన్న అంకమ్మపాలెం కాళికాదేవి, కేశవ స్వామిపేటలోని మహిషాసుర మర్దిని కళారాలు ఉన్నా యి. నాలుగు కళారాలు పసుపు వర్ణంతో, కాళికాదేవి ఎర్రగా, నరసింహ స్వామి తెల్లగా ఉంటారు. ఈసారి బాలాజీరావు పేటలోని కనకదుర్గమ్మ కళారం నూతనంగా తయారు చేశారు. సుమారు 50 కేజీల పంచలోహాలతో అమ్మవారి కళారాన్ని తయారుచేసి నగరోత్సవం నిర్వహిస్తున్నామని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు.
దుర్గాష్టమి సందర్భంగా మంగళవారం రాత్రి బాలాజీరావు పేటలోని కనకదుర్గమ్మ అంకమ్మపాలెంలోని కాళికా దేవి. కొత్తపట్నం బస్టాండ్ నల్లూరి నర్సింగ్ హోమ్ దగ్గర బాలా త్రిపుర సుందరీ దేవి, నగర ఉత్సవానికి బయలుదేరుతాయి. నగరంలోని వేరువేరు మార్గాల్లో పయనించి బుధవారం ఉదయం మస్తాన్ దర్గా సెంటర్ దగ్గరకు చేరుకుంటాయి. బుధవారం అర్ధరాత్రి కేశవస్వామి పేటలోని మహిషాసుర మరి్ధని, గంటాపాలెంలోని పార్వతీదేవి కొత్తపట్నం బస్టాండ్ నల్లూరి నర్సింగ్ హోమ్ దగ్గర నరసింహ స్వామి కళారాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయి.
కళారం అంటే...
ఒకసారి రక్త బీజుడు అనే రాక్షసుడుతో అమ్మవారు యుద్ధం చేయాల్సి వచ్చింది. అతని శిరస్సును ఖడ్గంతో ఖండిస్తుంది. రక్తం ధారలుగా నేల మీద పడుతుంది. ప్రతి రక్తపు చుక్క నుంచి మళ్లీ ఒక రక్త బీజుడు పుట్టుకొస్తాడు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడికి ఇచ్చిన వరంతో అమ్మవారితో యుద్ధం చేస్తూ పోటీగా నిలబడతాడు. అమ్మవారు తన శక్తి నుంచి నల్లని కాళీ రూపాన్ని సృష్టించి కాళికాదేవిగా దేవిగా మారి పెద్ద నాలుకతో రక్తబీజుడి నుంచి కారే రక్తపు బొట్టును భూమి మీద పడకుండా తాగేస్తూ ఆ రాక్షసుడి శక్తిని హరించి అంతం చేస్తుంది.
అప్పుడు ప్రజలంతా కాళికామాతకు జయ జయ ధ్వానాలు పలికి అమ్మవారిని తమ మధ్య ఉండి పోవాలని కోరగా దానికి అమ్మవారు ‘‘అలా కుదరదు, ముల్లోకాలు రక్షణ బాధ్యత నాదే కదా. మీ కోరిక ప్రకారం ప్రజలందరికీ దుష్టశక్తుల భయం లేకుండా నా అంశంతో నిబిడీకృతమైన కళారాన్ని నోరు తెరిచి ఉన్న శిరస్సు భాగం ప్రసాదిస్తున్నాను. ఆ రూపాన్ని పూజించి ఆరాధించండి. దసరా నవరాత్రులలో దుర్గాష్టమి, మహార్నవమి రోజుల్లో అర్ధరాత్రి కళారాన్ని నగరసంచారం చేయించండి. నగరంలోని దుష్టశక్తులన్నీ పారిపోతాయని’’ అమ్మవారు అభయమిస్తుంది. విష్ణుమూర్తి తత్వమైన నరసింహ స్వామి కళారంగా వచ్చి మిమ్మల్ని తరింప చేస్తానని అమ్మవారు వరమిస్తుంది. అని పెద్దలు చెబుతారు. ఈ విధంగా ప్రారంభమైనదే మన కళారాల చరిత్ర.