బాబు పాలనలో వ్యవస్థలన్నీ కుదేలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపు
పొన్నలూరు: చంద్రబాబు పాలనలో ప్రస్తుతం వ్యవస్థలన్నీ బ్రష్టుపట్టి కుదేలయ్యాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పొన్నలూరు మండలం వెంకుపాలెం గ్రామంలో మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌తో కలిసి పర్యటించిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 18 నెలల పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు, కేసులు తప్పా ప్రజల సంక్షేమం ఏమీ లేదన్నారు. పోలీసులను పావుగా వాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. పోలీసులు కూడా అధికారపార్టీ నేతలు చెప్పిందే తడువుగా ప్రతి పక్ష పార్టీ నేతలు, కార్యకర్తల పై అక్రమ కేసులు పెడుతూ ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత విధ్వంస పాలనతో పేద ప్రజలకు ఆర్ధిక భరోసా, రక్షణ లేకుండా పోతోందన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని లిక్కర్, ఇసుక, మట్టి, గంజాయి మాఫియాగా తయారై రాష్ట్రంలో దోచుకుంటూ శాంతిభద్రతలు లేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రజా పక్షాన నిలవాలన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి గ్రామాల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాబోవు రోజుల్లో ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి...
చంద్రబాబు ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, దాడులకు కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగి పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో సమర్ధవంతమైన నాయకత్వం ఉందని చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారికి అండగా నిలవాలన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో కార్యకర్తల కృషి, ప్రజల ఆశీస్సులతో కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఒంగోలు పార్లమెంట్, కొండపి నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పిల్లి తిరుపతిరెడ్డి, కాటా మాధవరావు, గడ్డం మాల్యాద్రి, కాటా మల్లికార్జున, యర్రా రామకృష్ణ, అనుమోలు ప్రసాద్, మార్తాల వెంకటేశ్వరరెడ్డి, కనపర్తి గోవిందమ్మ, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


