స్వరూపం మారనున్న ఉమ్మడి జిల్లా..
28 మండలాలతో ప్రకాశం, 21 మండలాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రకాశంలో ఒంగోలు, కందుకూరు, అద్దంకి రెవెన్యూ డివిజన్లు మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు దర్శి నియోజకవర్గం మొత్తం ప్రకాశంలోనే మంగళవారం జీఓ విడుదలజేసిన ప్రభుత్వం కొత్త జిల్లాకు అధికారులను కేటాయించని ప్రభుత్వం అప్పటి వరకూ ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సెకండ్ గ్రేడ్ అధికారులు పనిచేయాలి నేటి నుంచి మార్కాపురంలో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు
ఒంగోలు సబర్బన్/మార్కాపురం:
ఉమ్మడి ప్రకాశం జిల్లా స్వరూపం మారుతోంది. 28 మండలాలతో ప్రకాశం జిల్లాను పునర్వ్యవస్థీకరిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్.నెం.523, 524లను జారీ చేసింది. అలాగే నూతనంగా ఏర్పాటు కానున్న మార్కాపురం జిల్లాలో 21 మండలాలు ఉంటాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు నియోజకవర్గాన్ని, బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, మర్రిపూడి, పొన్నలూరు మండలాలతో కూడిన కందుకూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటైంది. ఒంగోలు రెవెన్యూ డివిజన్లో కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ, ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు మండలాలు ఉంటాయి. కొరిశపాడు, జే పంగులూరు, అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలతో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, దొనకొండ మండలాలు మార్కాపురం జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయని ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం తాజా ఇచ్చిన ఉత్తర్వుల్లో దర్శి నియోజకవర్గం మొత్తం ప్రకాశం జిల్లాలోనే ఉండనుంది. అద్దంకిలో నూతన డివిజన్ కార్యాలయం బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. డివిజన్ ఇన్‌చార్జిగా ఒంగోలు ఆర్డీవో వ్యవహరించనున్నారు.
మార్కాపురం, కనిగిరి
నేడు మార్కాపురానికి కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో నూతన జిల్లా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టరుతో పాటు డీఆర్‌ఓ వివిధ శాఖల అధికారులు బుధవారం మార్కాపురం రానున్నారని ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జీవోను విడుదల చేసినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల కార్యాలయాలను పరిశీలించనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసే కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా కలెక్టర్ రాజబాబు పరిశీలించనున్నారు. ఎస్‌పీ ఆఫీసును కూడా పరిశీలించనున్నారు.


