ఊరూవాడ..మద్యం, గంజాయి వినియోగం పెరిగింది. చంద్రబాబు ప్ర
పెరిగిన మందుబాబుల సంఖ్య మద్యం కేసులూ పెరిగాయి 5808 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బహిరంగ మద్యం 33.736 శాతం పెరిగిన కేసులు గంజాయి కేసుల్లో 7 శాతం పెరుగుదల 136 మంది బాలికలు, 292 మహిళల అదృశ్యం చోరీ కేసుల్లో 51 శాతం రికవరీ సీసీ, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా
సమష్టి కృషితో నేరాల సంఖ్య తగ్గింది
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాలకు తలుపులు బార్లా తెరిచింది. దాంతో ఊరికి రెండు మూడు బెల్టు షాపులు వచ్చాయి. అదే స్థాయిలో మద్యం సేవించే వారి సంఖ్య కూడా పెరిగింది. మద్యం కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. జిల్లాలో 2025 సంవత్సరంలో బహిరంగంగా మద్యం తాగుతున్న 20031 మందిపై కేసులు నమోదయ్యాయి. 2024వ సంవత్సరంలో ఈ సంఖ్య 14,978 ఉండగా ఈ ఏడాది 33.736 శాతం పెరిగింది. జిల్లాలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయి కానీ మద్యం అందుబాటులో లేని గ్రామం ఒక్కటంటే ఒక్కటి కూడా చూపించలేరు. అసలు దుకాణం వద్దకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఒక్క ఫోన్ చేస్తే చాలు ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. 2024లో 4,136 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 5,808 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,363 మందిని కోర్టులో హాజరుపరచగా జరిమానాలు, జైలు శిక్షలు విధించింది. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు చెప్పవచ్చు. ఈ ఏడాది 757 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే మాత్రం 13.29 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గడం ఉపశమనం కలిగించే విషయంగా చెప్పవచ్చు. మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది 29 నార్కోటిక్స్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 31 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రతి రోజూ గంజాయి పట్టుబడుతోంది. రైళ్లలో గంజాయి రవాణా ఎకై ్సప్రెస్ వేగంగా జరుగుతోంది. తాజాగా పశ్చిమాన గంజాయి సాగు వెలుగుచూడడం ఆందోళన కలిగించే అంశం. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికలో ఇచ్చిన వివరాల ప్రకారం...
మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో మహిళలపై హింస పెరిగింది. మహిళలు, బాలికల మిస్సింగ్ ఆగలేదు. 2025లో జిల్లాలో 136 మంది బాలికలు, 292 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. అలాగే వరకట్నం వేధింపులు, గృహహింస, హత్య, కిడ్నాప్ తదితర మహిళలపై నేరాలకు సంబంధించి 709 కేసులు నమోదయ్యాయి. బాలికలపై లైంగికదాడులకు సంబంధించి గత ఏడాది 92 కేసులు నమోదు కాగా ఏడాది 85 కేసులు నమోదయ్యాయి. ఫోక్సో కేసుల్లో 7.67 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో బాలికలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. శక్తి యాప్‌ను 18,034 మంది మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేశారు. లైంగిక నేరాల విషయంలో 346 మందిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేశారు.
జిల్లాలో 2025వ సంవత్సరంలో 632 దొంగతనాలు జరిగాయి. సుమారుగా రూ.8.70 కోట్లు చోరీ అయ్యాయి. సీసీ ఫుటేజీలు, ఫింగర్ ప్రింట్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారీగా రికవరీ చేశారు. ప్రాపర్టీ నేరాల్లో రూ.4.44 కోట్లను రికవరీ చేశారు. వీటితోపాటుగా నైట్ బీట్స్, విజిబుల్ పోలీసింగ్, సీసీ, డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచడంతో గణనీయంగా నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్ చలనాలను కూడా భారీగా వసూలు చేయడం గమనార్హం. ఈ ఏడాది ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రూ.2.02 కోట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కూడా జరిమానాల రూపంలో రూ.1,77,24,500 వసూలు చేశారు. 2024లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కేవలం రూ.60,63,140 మాత్రమే వసూలు చేశారు. ఈ ఏడాది వసూలు చేసిన మొత్తం రెట్టింపుకంటే ఎక్కువగా ఉంది.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా నేరాలను కట్టడి చేయడానికి సీసీ కెమెరాలు, డ్రోన్లను విరివిగా వినియోగిస్తున్నారు. జిల్లాలో 32 డ్రోన్ కెమెరాలు ఉన్నాయి. దీని ద్వారా 6474 ప్రదేశాల్లో నిఘా ఉంచారు. 502 మ్యాట్రిక్స్ సీసీ కెమెరాలు, 5737 ప్రైవేటు కెమెరాలతో కలుపుకొని మొత్తం 6239 సీసీ కెమెరాలు నిఘా నేత్రం తెరచి పర్యవేక్షిస్తున్నాయి. డయల్ 112 కు 18,426 కాల్స్ రాగా వాటికి పోలీసులు సకాలంలో స్పందించారు. జిల్లాలో వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 3891 మంది వలస కార్మికులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 1214 మంది రౌడీ షీటర్లు ఉండగా వారిలో 173 మంది మాత్రం చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. ఎంఎస్‌సీడీ ద్వారా 65,576 మందిని చెక్ చేయగా వారిలో 190 మంది పాత నేరస్తులున్నట్లు గుర్తించి ముందస్తు జాగ్రత చర్యలు తీసుకున్నారు. మోంథా తుఫాను సమయంలో మూసీ వాగు వరదల్లో చిక్కుకున్న 121 మంది వలస కూలీలను రక్షించడంలో పోలీసులు చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అన్ని రకాల నేరాలకు సంబంధించి 2024లో 8371 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 7,818 మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాది 11,705 కేసులు విచారణలో ఉండగా 2025లో 13018 కేసుల్లో 7897 కేసులను డిస్పోజల్ చేయడం ద్వారా 6 శాతం కేసులను తగ్గించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది సమష్టి కృషి ఫలితంగానే జిల్లాలో ఈ ఏడాదిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సమర్ధవంతమైన పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కేసులను ఛేదిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం. అందుకే రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపడతాం. హెల్మెట్ లేకుండా హైవే ఎక్కడానికి అనుమతించం. మహిళలు, బాలికల రక్షణ కోసం విస్తృతంగా అవగాహన చర్యలు చేపడతాం. ప్రజల భద్రతే ప్రధాన అంశంగా నేర రహిత సమాజ నిర్మాణం దిశగా జిల్లా పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తుంది.
– ఎస్పీ హర్షవర్థన్ రాజు


