ఆలిండియా 7వ ర్యాంకు పొందిన డాక్టర్ శ్రీసాయి త్రిషారెడ్డి
సాక్షి, నరసరావుపేట: పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎన్‌ఐ సెట్–2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది. ఎంతో పోటీ ఉండే ఈ ఐఎన్‌ఐ సెట్‌లో (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్–కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్) తొలి ప్రయత్నంలోనే త్రిషారెడ్డి ఆలిండియాలో 7వ ర్యాంకుతోపాటు దక్షిణాదిలో మొదటి ర్యాంకు పొందింది. తమ కుమార్తె సాధించిన ఈ ఘనతపై ఆమె తల్లిదండ్రులు బారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, అనంత లక్ష్మిలు ఎంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
వీరి స్వస్థలం గురజాల మండలం తేలుకుట్ల కాగా వ్యాపారరీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. త్రిషా ఐదేళ్ల క్రితం నీట్ యూజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 14వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ఇక ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించిన జనవరి సెషన్ ఐఎన్‌ఐ సెట్‌లో దేశంలోని వివిధ ఎయిమ్స్‌లతో పాటు కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం ఈనెల 9న పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను శనివారం రాత్రి ఎయిమ్స్ అధికార వర్గాలు విడుదల చేశాయి. చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఫలితాలను సాధించిన సాయి త్రిషారెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


