breaking news
PG medical course
-
ప్రవేశాలు మొదలయ్యాక మార్పులు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మారుస్తూ ‘లోకల్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 2025–26 విద్యా సంవత్సరానికి స్థానికులకు 85 శాతం, అఖిల భారత కోటాగా 15 శాతం కేటాయించడం సరికాదని అభ్యంతరం తెలిపింది. ప్రైవేట్, అన్–ఎయిడెడ్, మైనారిటీ, నాన్–మైనారిటీ కళాశాలల మేనేజ్మెంట్ కోటాలో ఈ విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్లలో జీఓ అభ్యంతరకరమని అభిప్రాయపడింది. ఈ విద్యా సంవత్సరానికి తాజా ‘కోటా’వర్తించదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వర్సిటీ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో పిటిషనర్ న్యాయవాది రిప్లై కౌంటర్ వేయాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లను స్థానికులకు, 15 శాతం అఖిల భారత కోటా కింద కేటాయిస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 200ను సవాల్ చేస్తూ బెంగళూరుకు చెందిన స్వరూప్ హెచ్ఈఎస్తోపాటు మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విద్యా సంవత్సరానికి ఆమోదయోగ్యం కాదు.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జి. మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ ‘పిటిషనర్లు తెలంగాణకు స్థానికేతరులు. ప్రైవేట్, అన్–ఎయిడెడ్, మైనారిటీ, మైనారిటీయేతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నాన్–లోకల్ విద్యార్థులకు అన్యాయం జరిగేలా జీవో తెల్చింది. రాష్ట్రంలోని స్థానికులకు 85 శాతం, అఖిల భారత కోటాగా 15 శాతం కేటాయించడం సరికాదు. 2025–26 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా కింద పీజీ వైద్య విద్య ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులకు ఈ జీఓ విరుద్ధంగా ఉందని చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలు మారుస్తూ జీఓ జారీ చేయడం చట్టవిరుద్ధం.. దాన్ని రద్దు చేయాలి’అని కోరారు. దీనిపై వైద్యారోగ్య శాఖ జీపీ రమేశ్, కాళోజీ వర్సిటీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ టి శరత్ స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మార్చడాన్ని తప్పుబడుతూ ఈ విద్యా సంవత్సరానికి పాత విధానాన్నే కొనసాగించాలని తేల్చిచెప్పింది. -
ఐఎన్ఐ సెట్లో పల్నాడు అమ్మాయి సత్తా
సాక్షి, నరసరావుపేట: పీజీ మెడికల్ కోర్సులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐఎన్ఐ సెట్–2025లో పల్నాడు జిల్లాకు చెందిన డాక్టర్ బారెడ్డి శ్రీసాయి త్రిషారెడ్డి ఆలిండియా 7వ ర్యాంకు సాధించింది. ఎంతో పోటీ ఉండే ఈ ఐఎన్ఐ సెట్లో (ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్–కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్) తొలి ప్రయత్నంలోనే త్రిషారెడ్డి ఆలిండియాలో 7వ ర్యాంకుతోపాటు దక్షిణాదిలో మొదటి ర్యాంకు పొందింది. తమ కుమార్తె సాధించిన ఈ ఘనతపై ఆమె తల్లిదండ్రులు బారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, అనంత లక్ష్మిలు ఎంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.వీరి స్వస్థలం గురజాల మండలం తేలుకుట్ల కాగా వ్యాపారరీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. త్రిషా ఐదేళ్ల క్రితం నీట్ యూజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 14వ ర్యాంకు సాధించి ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. ఇక ఎయిమ్స్ న్యూఢిల్లీ నిర్వహించిన జనవరి సెషన్ ఐఎన్ఐ సెట్లో దేశంలోని వివిధ ఎయిమ్స్‌లతో పాటు కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం ఈనెల 9న పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను శనివారం రాత్రి ఎయిమ్స్ అధికార వర్గాలు విడుదల చేశాయి. చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఫలితాలను సాధించిన సాయి త్రిషారెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
పీజీ వైద్యవిద్యలో క్లినికల్ కోర్సుల్లో రిజర్వేషన్ 15 నుంచి 20% పెంపు
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటాను క్లినికల్ కోర్సుల్లో 15 నుంచి 20 శాతానికి పెంచుతామని పీహెచ్సీ వైద్యులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుధవారం పీహెచ్ వైద్యుల సంఘం ప్రతినిధులతో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చర్చించారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం వెల్లడించింది. కోటాను 15 నుంచి 20 శాతానికి పెంచడంతోపాటు అన్ని కోర్సుల్లో ఇన్‌సర్వీస్ కోటా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొంది.భవిష్యత్‌లో కోటాలో మార్పులు చేయాల్సివస్తే ముందు వైద్యులతో చర్చిస్తామన్నట్టు తెలిపింది. సర్వీస్‌లోకి రాకముందు పీజీ చేసినవారికి రెండో పీజీ చేయడానికి ప్రభుత్వం మీద భారం లేకుండా అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఇవే చివరి చర్చలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అంగీకరించి వైద్యులు సమ్మెను విరమించాలని స్పష్టం చేసింది. అలా కాకుండా జీవో రద్దుచేయాలని మొండిపట్టుతో సమ్మె కొనసాగిస్తే జీవో 85లో ఎటువంటి సవరణలు లేకుండానే పీజీ ప్రవేశాలు చేపడతామని హెచ్చరించింది. ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం 14కు వాయిదా202425 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు వచ్చే నెల (అక్టోబర్) 14 నుంచి ప్రారంభమవుతాయని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) సవరించిన మార్గదర్శకాలను ఎన్ఎంసీ విడుదల చేసిందని, దాని ప్రకారం తరగతుల ప్రారంభం 14కు వాయిదా పడినట్టు వివరించారు.నర్సింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పెంపుబీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీ వరకూ పొడిగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నర్సింగ్ విద్యా సంస్థల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధికారెడ్డి తెలిపారు. ఇకపై పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. -
NEET PG Exam 2024; జూలై 7న నీట్ పీజీ పరీక్ష
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్–పీజీ పరీక్షను ఈ ఏడాది జూలై 7వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ మంగళవారం తెలిపింది. ఈ పరీక్షకు కటాఫ్ అర్హత తేదీ ఈ ఏడాది ఆగస్ట్ 15గా పేర్కొంది. నీట్ పీజీ పరీక్షను మార్చి 3వ తేదీన నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం గుర్తు చేసింది. ఈ పరీక్షను సవరించిన షెడ్యూ ల్ను అనుసరించి జూలై 7వ తేదీన నిర్వహి స్తామని వివరించింది. ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఒకే ఒక్క అర్హత పరీక్ష నీట్ పీజీ ఎలిజిబిలిటీ కం ర్యాంకింగ్ పరీక్ష. -
ఒప్పందం ఆధారంగా ఫీజుల ఖరారు చెల్లదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల వార్షిక ఫీజులను భారీగా పెంచుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 72, 77లను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం ఫీజులను నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. ఫీజుల పెంపుపై అప్పట్లో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఏకాభిప్రాయం ప్రకారమే ఫీజులను పెంచడం జరిగిందని, ఇందులో ఎలాంటి తప్పులేదన్న మెడికల్ కాలేజీల వాదనను తోసిపుచి్చంది. 2017–18 నుంచి 2019–20 సంవత్సరాలకు ఏఎఫ్ఆర్సీ సిఫారసులు లేకుండా ప్రభుత్వం నేరుగా ఫీజులు పెంచిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపింది. -
యూనిట్ల లెక్క తప్పింది
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్లు కాపాడుకునేందుకు ఇచ్చిన తప్పుడు లెక్కలు ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. యూనిట్లు తక్కువగా ఉన్నప్పటికీ గతంలో ఎక్కువ ఉన్నట్లు చూపించి సీట్లను కాపాడుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్) కింద 10 శాతం కోటా కల్పించాలని నిర్ణయించింది. దీనికోసం పీజీ వైద్యసీట్లను అదనంగా 10 శాతం పెంచుతామని ప్రకటించింది. కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న పీజీ వైద్యసీట్లు, యూనిట్లు, అధ్యాపకులు, బెడ్లు ఇలా అన్ని వివరాలను తక్షణమే పంపించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో 10 శాతం ఈబీసీ కోటా అమలు చేయాలని, ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సీట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 10 శాతం సీట్లు పెంచాలన్నది కేంద్రం ఆలోచన. కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో స్పెషాలిటీల వారీగా అదనంగా 3 సీట్లు వస్తాయి. ప్రతి స్పెషాలిటీలో ప్రతి కళాశాలలో సీట్లు పెరుగుతాయి. ఈ ఆలోచన బాగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిక్కుల్లో పడింది. ఒక పీజీ వైద్య సీటుపెరగాలంటే ఫ్యాకల్టీ నుంచి యూనిట్ల వరకూ లెక్కలుండాలి. ఇదివరకే రాష్ట్రంలో తక్కువ యూనిట్లున్నా ఎక్కువగా ఉన్నట్లు చూపించి పీజీ వైద్య సీట్లను నిలుపుకుంది. ప్రభుత్వం నిధులిచ్చేనా? రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 820 పీజీ సీట్లు అందుబాటులో ఉండగా, ఈబీసీ కోటా కింద 10 శాతం అదనంగా.. అంటే 82 పీజీ వైద్యసీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ, ఈ 82 సీట్లకు సంబంధించిన వసతులు కల్పించే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే మౌలిక వసతులు, వైద్య పరికరాలకు అవసరమైన నిధులే ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈబీసీ కోటా సీట్లకు కావాల్సిన వసతులు ఏ మేరకు కల్పిస్తారోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్యసీట్లలో ఈబీసీ కోటా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ కోటా కోసం పెరగాల్సిన సీట్లు పెరిగే అవకాశం లేకపోవడంతో కష్టాలు తప్పవంటున్నారు. 10 శాతం అదనపు సీట్లకు యూనిట్లు ఎక్కడి నుంచి తేవాలి? యూనిట్లు కావాలంటే అదనపు సిబ్బంది కావాలి, నర్సులు పెరగాలి, పడకలు పెరగాలి, ఇవన్నీ చెయ్యాలంటే నిధులు కావాలి, ఏం చేద్దాం అంటూ వైద్య విద్యా శాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు. ఉన్న సీట్లనే కాపాడుకోవడానికి లేని యూనిట్లను చూపిస్తున్నాం, మళ్లీ కొత్త సీట్లు కావాలంటే ఉన్నవి కూడా పోయే ప్రమాదం ఉంటుందేమో అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీసీటీవీల మధ్య పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు బుధవారం ఉదయం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. గత సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సీసీటీవీ కెమెరాల మధ్య కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను రికార్డు చేస్తున్నారు. మార్చి 1న నిర్వహించిన పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8,992 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. కన్వీనర్ కోటా కింద మొత్తం 1,860 సీట్లకు ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇందులో 1,193 సీట్లు నాన్‌సర్వీస్ అభ్యర్థులకు, 667 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 9 గంటల నుంచి కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తొలి రోజు జరిగే కౌన్సెలింగ్‌కు ఒకటి నుంచి 800 ర్యాంకుల వరకు అభ్యర్థులను ఆహ్వానించారు. రెండో విడత కౌన్సెలింగ్ జూన్ 1 నుంచి నిర్వహించనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు మే 15లోగా ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు పోంది, 16న చేరాల్సి ఉంటుంది. -
నేటి నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు బుధవారం నుంచి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో జరగనున్న తొలి విడత కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు మంగళవారం తెలిపారు. మార్చి 1న నిర్వహించిన పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8,992 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 1,860 సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఇందులో 1,193 సీట్లు నాన్‌సర్వీస్ అభ్యర్థులకు, 667 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటాయించినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 9 గంటల నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. తొలి రోజు జరిగే కౌన్సెలింగ్‌కు ఒకటి నుంచి 800 ర్యాంకుల వరకు అభ్యర్థులను ఆహ్వానించారు. రెండో విడత కౌన్సెలింగ్ జూన్ 1 నుంచి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు మే 15లోగా ఆయా కళాశాలల్లో అడ్మిషన్లు పోందాలని, 16న చేరాలని సూచించారు. -
నేటినుంచి ఆన్లైన్లో పీజీ మెడికల్ దరఖాస్తులు
విజయవాడ: 2015-16 విద్యాసంవత్సరానికి గాను పీజీ మెడికల్ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా), పీజీ డెంటల్ (ఎండీఎస్) కోర్సుల్లో అడ్మిషన్లకు డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలకు శనివారం నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ చెప్పారు. దరఖాస్తు చేసుకునే విధానం, ప్రవేశ పరీక్ష, ఫీజు వివరాలు http://www.drntruhs.org వెబ్సైట్లో చూడొచ్చు. అలాగే ఇతర దేశాల్లో అండర్ గాడ్య్రుయెట్ డిగ్రీ చదివిన విద్యార్థులు ఎంసీఐ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రూ.7 వేలు, ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు రూ.3 వేలుగా ఫీజుగా నిర్ణయించారు. వివరాలు http://ntruhs.inc.in వెబ్సైట్లో పొందవచ్చు.


