పీజీ మెడికల్‌లో సర్కార్ ‘లోకల్’నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం
ఈ విద్యా సంవత్సరానికి జీఓను నిలిపివేసిన ధర్మాసనం
కౌంటర్లు వేయాలని ప్రతివాదులకు ఆదేశం.. విచారణ జనవరి 19కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మారుస్తూ ‘లోకల్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 2025–26 విద్యా సంవత్సరానికి స్థానికులకు 85 శాతం, అఖిల భారత కోటాగా 15 శాతం కేటాయించడం సరికాదని అభ్యంతరం తెలిపింది. ప్రైవేట్, అన్–ఎయిడెడ్, మైనారిటీ, నాన్–మైనారిటీ కళాశాలల మేనేజ్‌మెంట్ కోటాలో ఈ విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్లలో జీఓ అభ్యంతరకరమని అభిప్రాయపడింది.
ఈ విద్యా సంవత్సరానికి తాజా ‘కోటా’వర్తించదని తేల్చిచెప్పింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ వర్సిటీ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో పిటిషనర్ న్యాయవాది రిప్లై కౌంటర్ వేయాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది.
రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లను స్థానికులకు, 15 శాతం అఖిల భారత కోటా కింద కేటాయిస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 200ను సవాల్ చేస్తూ బెంగళూరుకు చెందిన స్వరూప్ హెచ్‌ఈఎస్‌తోపాటు మరికొందరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ విద్యా సంవత్సరానికి ఆమోదయోగ్యం కాదు..
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జి. మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ ‘పిటిషనర్లు తెలంగాణకు స్థానికేతరులు. ప్రైవేట్, అన్–ఎయిడెడ్, మైనారిటీ, మైనారిటీయేతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నాన్–లోకల్ విద్యార్థులకు అన్యాయం జరిగేలా జీవో తెల్చింది. రాష్ట్రంలోని స్థానికులకు 85 శాతం, అఖిల భారత కోటాగా 15 శాతం కేటాయించడం సరికాదు.
2025–26 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటా కింద పీజీ వైద్య విద్య ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులకు ఈ జీఓ విరుద్ధంగా ఉందని చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిబంధనలు మారుస్తూ జీఓ జారీ చేయడం చట్టవిరుద్ధం.. దాన్ని రద్దు చేయాలి’అని కోరారు.
దీనిపై వైద్యారోగ్య శాఖ జీపీ రమేశ్, కాళోజీ వర్సిటీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ టి శరత్ స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రవేశాల ప్రక్రియ మొదలయ్యాక నిబంధనలు మార్చడాన్ని తప్పుబడుతూ ఈ విద్యా సంవత్సరానికి పాత విధానాన్నే కొనసాగించాలని తేల్చిచెప్పింది.


