జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్రపతి ముర్ము. చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్, కేంద్ర మంత్రి షెకావత్, మంత్రి సీతక్క తదితరులు
రాష్ట్రపతి నిలయంలో 2వ ‘భారతీయ కళా మహోత్సవం’
ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పశ్చిమ రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకే ఈ ఉత్సవమని వెల్లడి
పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, షెకావత్, గవర్నర్లు జిష్ణుదేవ్, అశోక్ గజపతిరాజు, మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని ఆమె సూచించారు. పశ్చిమ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకే భారతీయ కళామహోత్సవ్– 2025ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు.
తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాన్ని సాంస్కృతిక, జౌళి, పర్యాటక శాఖల సహకారంతో రాష్ట్రపతి నిలయం నిర్వహిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, గోవా, దాద్రా–నాగర్ హవేలి, డామన్–డయ్యూలలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం ఈ ఉత్సవం లక్ష్యం. గతేడాది ఈశాన్యం.. ఈసారి పశి్చమం..: ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ గతేడాది నిర్వహించిన భారతీయ కళా మహోత్సవ్ మొదటి ఎడిషన్‌లో ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేశామన్నారు.
ఈసారి పశ్చిమ రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని చూసి అర్థం చేసుకొనే అవకాశం ప్రజలకు లభించిందని చెప్పారు. హస్తకళలు, నృత్యం, సంగీతం, సాహిత్యం, వంటకాల ద్వారా పశి్చమ రాష్ట్రాల్లోని జానపద సంస్కృతిని సందర్శకులు తెలుసుకోగలరని చెప్పారు. ఎన్నో రాష్ట్రాల కళాకారుల కళారూపాలను తిలకించడంతోపాటు వారితో మాట్లాడే అవకాశం తనకు లభించిందన్నారు.
రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు చేరువ చేస్తున్నా..
దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని.. అందులో భాగంగానే రాష్ట్రపతి భవన్‌లోనూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. సిమ్లా, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలోని రాష్ట్రపతి నిలయాలను ఏటా ప్రజల రాక కోసం తెరిచి ఉంచుతున్నామన్నారు. రాష్ట్రపతి భవన్ దేశ ప్రజల భవన్ అనే భావనతో రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిరంతరం కార్యక్రమాలు చేపడతున్నట్లు ముర్ము వివరించారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల దేశ ప్రజలకు ఒకరి సంస్కృతులు మరొకరు తెలుసుకునే అవకాశం లభిస్తుందని.. దేశ సంస్కృతిపై పరస్పర గౌరవం పెరగడంతోపాటు దాన్ని కాపాడుకోవాలన్న ప్రేరణ కూడా లభిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ కళామహోత్సవ్ భారతీయ కళాత్మక సంపదకు ప్రతిబింబమన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఏక్ భారత్–శ్రేష్ట్ భారత్ భావనకు అనుగుణంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాజస్తాన్ గవర్నర్ హరిభావు బాగ్డే, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, మంత్రి సీతక్క పాల్గొన్నారు.
బేగంపేటలో రాష్ట్రపతికి ఘన స్వాగతం
అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్షి్మ, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసిన రాష్ట్రపతి.. శనివారం ఏపీలోని పుట్టపర్తికి వెళ్లనున్నారు.
మేడారం జాతరకు విచ్చేయండి.. రాష్ట్రపతికి మంత్రి సీతక్క ఆహ్వానం
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మంత్రి సీతక్క ఆహ్వానించారు. కళా మహోత్సవం కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం, ఆదివాసీ సమాజం తరఫున ఆహ్వానం పలికారు.
ములుగు జిల్లాలో టూరిజానికి రూ. 130 కోట్లు ఇవ్వండి
ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న ములుగు జిల్లాలో అభివృద్ధి పనులు, ఎకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క వినతిపత్రాలు అందచేశారు. బొగత వాటర్ ఫాల్స్, జంపన్న వాగు అభివృద్ధికి రూ. 50 కోట్ల చొప్పున కేటాయించాలని, మల్లూరు దేవస్థానం అభివృద్ధికి రూ. 30 కోట్లు ఇవ్వాలని కోరారు.


