మాట్లాడుతున్న భట్టి. చిత్రంలో జయశ్‌రంజన్, నవీన్ మిత్తల్
30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ
వ్యాపారవేత్తల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో భట్టి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డెలాయిట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, కేపీఎంజీ, బీసీజీ, పీడబ్ల్యూసీ, జేఎల్‌ఎల్ సహా పలు సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులకు వాతావరణ పరిస్థితులు, భౌగోళిక అంశాలతోపాటు నైపుణ్యంతో కూడిన తక్కువ ధరలకే మానవ వనరులు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశాలు అన్నారు.
దేశంలో ఈ విధమైన రాష్ట్రం మరెక్కడా లేదని పెట్టుబడిదారులకు వివరించారు. ఓఆర్‌ఆర్, దీనికి తోడుగా కొత్తగా ట్రిపుల్ ఆర్ వల్ల కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. ట్రిపుల్ ఆర్‌తో రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలు అనుసంధానమవుతాయని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు 39 రేడియల్ రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ 39 రేడియల్ రోడ్ల మధ్య ఫార్మా, ఐటీ, హ్యాండ్లూమ్, ఆగ్రో వంటి పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయని డిప్యూటీ సీఎం వివరించారు.
24 గంటల నాణ్యమైన విద్యుత్
రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తోందని భట్టి చెప్పారు. భవిష్యత్‌లో విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని భట్టి చెప్పారు. రూ.89 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడతామని, ఇప్పటికే రూ.60,799 వేల కోట్ల విలువైన పనులకు అన్నిరకాల అనుమతుల లభించాయని తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు సందీప్‌కుమార్ సుల్తానియా, నవీన్‌మిత్తల్, జయేశ్‌రంజన్, కృష్ణ భాస్కర్, ఎన్.బలరామ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.


