పరిగి ఎమ్మెల్యే కృషిని అభినందించిన రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్–హైదరాబాద్ హైవేలో భాగంగా తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణకు సహకరించడానికి కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకున్న సేవ్ బనియన్ ట్రీస్ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈ ప్రతినిధులను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సీఎం దగ్గరికి తీసుకెళ్లారు. దాదాపు 56 కిలోమీటర్ల రహదారి విస్తరణకు సంబంధించి ఎక్కువగా మర్రిచెట్లు ఉండటం వల్ల వాటి పరిరక్షణకు ఈ సంస్థ ప్రతినిధులు కోర్టులో కేసులు వేసిన సంగతి తెలిసిందే.
దీంతో చాలా కాలంగా ఈ రహదారి విస్తరణకు ముందుకు సాగకుండా ఆగింది. ఇటీవలే చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద బస్సు–టిప్పర్ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. రహదారి విస్తరణ కోసం రామ్మోహన్‌రెడ్డి ఎల్లప్పుడూ చొరవ తీసుకుని, పనులను ముందుకు తీసుకెళ్లడంలో చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు. సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


