వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైద్యులతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
తనను కలిసిన వైద్యులతో వైఎస్ జగన్ ఆవేదన
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని వివరించిన వైద్యులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విప్లవాత్మక మార్పులు
ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి మరిన్ని వ్యాధులను చేర్చాం
నాడు – నేడు ద్వారా ఆస్పత్రులు అభివృద్ధి చేశాం
రోగులకు విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం అందించాం
కొత్త వైద్య కళాశాలలు, ఫ్యామిలీ డాక్టర్‌తో మెరుగైన వైద్యం
వీటన్నింటినీ పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళతామని జగన్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మహోన్నత లక్ష్యంతో గత ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులతో అమలైన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరమని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపుగా నిలిచిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నరసరావుపేట, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు వైద్యులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగ పరిస్థితులు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారని తెలిపారు. ఆస్పత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు పారదర్శకంగా ఇవ్వకుండా, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందించాల్సిన వ్యాధులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా నిధులు కేటాయిస్తూ.. అందులో అవినీతి, కమీషన్లకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం (ఆరోగ్య ఆసరా), రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, నాడు – నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వైద్యులు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శేషిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, హనిమిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రకిరణ్, వసంత, చెన్నారెడ్డి, కొండారెడ్డి, జయభారత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, క్రాంతికుమార్, వెంకట లక్ష్మి తదితరులు వైఎస్ జగన్‌ను కలిశారు.


