సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, తీవ్ర ఎండల ప్రభావంతో విభిన్న పరిస్థితులు నెలకొన్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు.
దీని ప్రభావంతో బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 40–44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. శ్రీకాకుళంలో 7, విజయనగరంలో 6, పార్వతీపురంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 28 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయన్నారు. మంగళవారం గూడూరులో 45.4 డిగ్రీలు, పిడుగురాళ్లలో 44.9, ప్రకాశం జిల్లా కొండపిలో 44.6 డిగ్రీల∙గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.


