కుమార్తె చెప్పినా పట్టించుకోకుండా సహకరించాలన్న తల్లి
మహిళా పోలీస్ ఫిర్యాదుతో వ్యవహారం బట్టబయలు
విద్యార్థిని మంగళగిరి వన్‌స్టాప్ సెంటర్‌కు తరలింపు
పల్నాడు జిల్లా: తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కుమార్తైపె కన్నేసినప్పటికీ తల్లి నివారించకపోగా కుమార్తె ఫిర్యాదు చేసినా కూడా సహకరించాలంటూ ప్రోత్సహించేందుకు యత్నించిన ఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాజీనగర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె భర్తతో వివాదం కారణంగా తొమ్మిదేళ్ల కిందట విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సత్తెనపల్లిలో నివసిస్తూ పట్టణానికి చెందిన అక్రమ రేషన్ వ్యాపారి తులసీకృష్ణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అతడు నిత్యం ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఆమె కుమార్తైపె కూడా ఎక్కడబడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగంతో ఆమె తల్లికి చెప్పి విలపించింది. అయినప్పటికీ తల్లి నివారించే ప్రయత్నం చేయకపోగా సహకరించాలంటూ ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. ఈ క్రమంలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని బంధువైన వృద్ధురాలు ఇటీవల శివాజీనగర్‌లోని మహిళా పోలీస్ తిరుమల లక్ష్మి దృష్టికి తీసుకు రావడంతో వ్యవహారం బట్టబయలైంది. మహిళా పోలీస్ ఈనెల 5న డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జయరాజుకు సమాచారం అందించింది.
ఆయన ఈనెల 6న సత్తెనపల్లి ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రమీల నేతృత్వంలో ఆ విద్యార్థిని పట్టణ పోలీసుల వద్దకు తీసుకువచ్చి, జరిగిన ఘటనను వివరించారు. ఆ విద్యార్థిని కనిపించకుండా చేసేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నించగా పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తొలుత ఆమెను గురువారం నరసరావుపేట వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. శుక్రవారం మంగళగిరి లోని వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తులసీకృష్ణను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో సత్తెనపల్లి సబ్‌జైలుకు తరలించారు.


