మార్టూరులో భూ మాయ | - | Sakshi
Sakshi News home page

మార్టూరులో భూ మాయ

Dec 24 2025 4:08 AM | Updated on Dec 24 2025 4:08 AM

మార్టూరులో భూ మాయ

మార్టూరులో భూ మాయ

మార్టూరులో భూ మాయ మార్టూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడి భూ దందాతో స్థానిక అధికారులు వణికిపోతున్నారు. వీఆర్‌ఓ సహకారంతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంతం చేస్తున్న వైనం వారం రోజులుగా మార్టూరులో సంచలనంగా మారింది. ఈ విషయమై ఇప్పటికే మార్టూరు పోలీస్టేషన్లో ఓ కేసు నమోదు కాగా.. వెలుగు చూడాల్సినవి మరెన్నో ఉన్నాయి. జిల్లా మంత్రి ముఖ్య అనుచరుడికి చెందిన కోట్లాది రూపాయల విలువచేసే ఇంటి స్థలాన్ని నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అమ్మకానికి పెట్టడంతో ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వీఆర్‌ఓ మార్టూరులో 15 స్థలాలకు సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంత్రి అనుచరులు సోమవారం గత సంవత్సర కాలంగా మార్టూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్‌ ల గురించి ఆరా తీస్తున్నారు. ఇవి వెలుగులోకి వస్తే చాలామంది మెడకు చుట్టుకొనే అవకాశం లేకపోలేదు. భూ అక్రమాలకు మార్టూరు తహసీల్దార్‌ కార్యాలయం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతోపాటు ఆర్డీవో కార్యాలయం కూడా కేంద్రాలుగా మారడంతో ఈ అక్రమ దందాలను అడ్డుకునే నాధుడే లేకుండా పోయాడు. మార్టూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు జాతీయ రహదారికి అభిముఖంగా వేస్తున్న లేఅవుట్‌ మధ్యలో 0.80 సెంట్ల భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోమవారం రిజిస్ట్రేషన్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఖజానాకు రూ.12 లక్షల స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా వ్యవసాయ భూమిగా చూపుతూ రూ.80 వేల చలానాతో సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంటూరి సురేష్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం గమనార్హం. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని ద్వితీయ శ్రేణి అధికారి అయిన ఇంటూరి సురేష్‌ ఈ అక్రమాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించటం విశేషం. ఇదే భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయబోమని చెప్పిన మార్టూరు, ఇంకొల్లు సబ్‌ రిజిస్ట్రార్లకు క్యాంపు కార్యాలయానికి చెందిన కీలక నేత డిపార్ట్‌మెంటల్‌ విచారణ వేయిస్తానని బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్లాట్లు బుక్‌ చేసుకోవడం ద్వారా నిర్వహిస్తున్నప్పటికీ సదరు నేత కార్యాలయ పనివేళలు ముగిసిన తరువాత రాత్రుళ్లు సైతం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని ద్వితీయ శ్రేణి అధికారి ద్వారా పనులు చక్కబెట్టుకోవడం గమనార్హం. సబ్‌ రిజిస్ట్రార్‌ సెలవు పెట్టిన తేదీల్లో ఇంటూరి సురేష్‌ చేసిన రిజిస్ట్రేషన్లపై శాఖాపరమైన దర్యాప్తు నిర్వహిస్తే అనేక చీకటి కోణాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఈ నెలాఖరకు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్న ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్‌ షేక్‌ ఇస్మాయిల్‌ కాలేషా పచ్చనేత బెదిరింపులకు భయపడి మొహం చాటేసి తిరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు తాము చెప్పిన పనులు చేస్తే ఇక్కడ ఉండండి, లేదంటే తట్ట బుట్ట సర్దుకొని వెళ్లిపోండి అంటూ అధికారుల మెడపై కత్తి పెట్టి సదరు నేత బెదిరిస్తున్న తీరు అధికారులలో అభద్రతా భావానికి దారితీస్తోంది.

సబ్‌ రిజిస్ట్రార్‌కు గుండెపోటు

మరో వారం రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్న సబ్‌ రిజిస్ట్రార్‌ ప్రజాప్రతినిధి అనుచరుడి ఒత్తిడి తట్టుకోలేక సోమవారం అర్ధరాత్రి తీవ్ర గుండె నొప్పితో ఒంగోలులోని అంజయ్య రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్చడం గమనార్హం. కొందరు స్థానికులు సిండికేట్గా ఏర్పడి రెవెన్యూ అధికారుల సహకారంతో చేస్తున్న భూ దందాలు మార్టూరులో ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. తమ సొంత భూములను ఆన్‌లైన్‌ చేయటం కోసం సంవత్సరాల తరబడి తిప్పుతున్న రెవెన్యూ అధికారులు ఇతరుల ప్రైవేటు, ప్రభుత్వ భూములను అలవోకగా ఆన్‌లైన్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మార్టూరు మండలంలోని భూ దందాలపై కలెక్టర్‌ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇష్టారాజ్యంగా ప్రభుత్వ,

ప్రైవేటు ఆస్తుల ఆక్రమణ

సహకరిస్తున్న రెవెన్యూ, డివిజనల్‌

స్థాయి అధికారులు

అధికారులను బెదిరించి రిజిస్ట్రేషన్లు

చేయిస్తున్న ప్రజాప్రతినిధి కీలక

అనుచరుడు

ఒత్తిడితో గుండె నొప్పితో

ఆస్పత్రిలో చేరిన సబ్‌ రిజిస్ట్రార్‌

ఇసుక దందా...రేషన్‌ దందా... తాజాగా భూ దందాకు టీడీపీ నాయకులు తెరతీశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూములను ఆక్రమించుకుంటున్నారు. వీరి భూ దందాకు ఓ వీఆర్వో సహాయ సహకారాలు అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ అధికారులను బెదిరించి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ గుండెపోటు గురయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement