బాపట్లలో104 ఉద్యోగుల ఆందోళన
బాపట్ల: గ్రామీణ పేదలకు ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో వైద్యసేవలు అందిస్తున్న 104 వాహనంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యాన జిల్లా కలెక్టరేట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్ మాట్లాడుతూ 104 ఉద్యోగుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డ చందంగా ఉందని అన్నారు. అరవింద సంస్థ నుంచి భవ్య సంస్థలకు మారిన 104 ఉద్యోగుల్ని యజమాన్యం వేధింపులు గురి చేస్తుందన్నారు. ఉద్యోగులకు ఉన్న 15 సాధారణ సెలవులు రద్దు చేశారని, నెలకు ఒక సెలవు పెట్టినా జీతంలో కోత విధిస్తున్నారన్నారు. గత ఆరు నెలల నుంచి ప్లే స్లిప్పులు, జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదన్నారు. ప్రతినెలా అరవిందలో పనిచేస్తున్న జీతం కంటే రూ.500 నుంచి రూ.2000 వరకు జీతం తగ్గించి ఉద్యోగులకు ఇస్తున్నారన్నారు. ప్రశ్నించిన ఉద్యోగులపై యాజమాన్యం వేధింపులకు గురిచేస్తూ డ్యూటీలు చేయకుండా ఆపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి 104 ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.సురేందర్‌నాయుడు, పి.పవన్ కుమార్, ఎం.హరిబాబు, సీహెచ్.అశోక్‌కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


