కోటప్పకొండ ఉద్యోగి గుండెపోటుతో మృతి
విధుల్లో ఉండగా ఆలయ ప్రాంగణంలోనే
కుప్పకూలిన వైనం
ఈఓ వేధింపులతో మృతిచెందాడని బంధువుల ఆరోపణ
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
ఈఓ, సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్
నరసరావుపేటరూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నరసరావుపేట పట్టణంలో ని శ్రీనివాసనగర్‌కు చెందిన చిరుమామిళ్ల నాసరయ్య(40) 13 సంవత్సరాలుగా తోటమాలిగా(కన్సాలిడేట్) విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న నాసరయ్య ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఇతర సిబ్బంది గమనించి హూటాహుటిన కోటప్పకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే నాసరయ్య మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. నాసరయ్య మృతి వార్త తెలుసుకున్న కోటప్పకొండ ఆలయ సిబ్బంది, అర్చకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వచ్చారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం హృదయవిదారకంగా మారింది.
ఈఓ వేధింపులతోనే..!
నాసరయ్య మృతికి ఈఓ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ చల్లా శ్రీను కారణమంటూ బంధువులు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండలో పనిచేస్తున్న ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని తెలిపారు. ఈఓగా చంద్రశేఖర్ వచ్చిన దగ్గర నుంచి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న నాసరయ్యను అన్నదానానికి మార్చారని, తరువాత మొక్కలకు నీళ్లు పెట్టే పనులు అప్పగించారని వివరించారు. వారం రోజుల క్రితం మెమో ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని తెలిపారు. ముగ్గురు తోటమాలీలు ఉండగా నాకే పనులు అప్పగించి ఈఓ వేధిస్తున్నాడని పలుమార్లు బాధపడ్డాడని నాసరయ్య భార్య వరలక్ష్మి తెలిపారు.
అర్చకుల ఉద్యోగాలు అమ్ముకున్నారు..
కోటప్పకొండలో ఖాళీగా ఉన్న మూ డు అర్చక పోస్టులను ఈఓ చంద్రశేఖర్ రూ.30లక్షలకు అమ్ముకున్నాడని అర్చకులు ఆరోపించారు. ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యేను అర్చకులు కలిసి వివరించారు. అన్ని అర్హతలు ఉన్న తమకు అర్చక పోస్ట్‌లు ఇవ్వకుండా ఒకే కుటుంబానికి లాభం చేసేలా ఈఓ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తరువాత దీనిపై మాట్లాడదాం అంటూ ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మెల్యేకు నిరసన సెగ..
గుండెపోటుతో మృతిచెందిన నాసరయ్య మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈఓ వేదింపులతోనే గుండెపోటుతో మృతిచెందాడని తెలిపారు. మనుషుల ప్రాణాలు తీయడానికే ఈ ప్రభుత్వం వచ్చిందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారి ఆగ్రహం చల్లారలేదు. కోటప్పకొండలో ఎమ్మెల్యే తరఫున పర్యవేక్షిస్తున్న వెంకటప్పయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కోటప్పకొండ ఉద్యోగి గుండెపోటుతో మృతి


