న్యాయం చేస్తారా.. ఊరు వదిలి వెళ్లాలా? | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేస్తారా.. ఊరు వదిలి వెళ్లాలా?

Dec 24 2025 4:01 AM | Updated on Dec 24 2025 4:01 AM

న్యాయ

న్యాయం చేస్తారా.. ఊరు వదిలి వెళ్లాలా?

జాతీయ రహదారిపై తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తుల ఆందోళన

గంటపాటు స్తంభించిన వాహనాల రాకపోకలు

రొయ్యల కంపెనీల వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం

కంపెనీ నుంచి వస్తున్న దుర్గంధానికి

ఉండలేకపోతున్నామంటూ ఆవేదన

కర్లపాలెం: రొయ్యల కంపెనీల నుంచి వస్తున్న కలుషిత నీటితో.. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని దీని వలన పంటలు పండించుకోవటానికి, తాగునీరుగా వినియోగించుకోవటానికి బోర్లలో నీరు పనికి రావటం లేదని కంపెనీల నుంచి వస్తున్న దుర్వాసనకు ఉండలేకపోతున్నామని గ్రామాలు ఖాళీచేయాల్సిన పరిస్థితి వస్తుందని కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తులతోపాటు రొయ్యల కంపెనీల సమీపాన ఉన్న మోటుపాలెం, బోలాయపాలెం, బిడారుదిబ్బ, దుండివారిపాలెం, గ్రామాల ప్రజలు మంగళవారం 216 జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై పలు గ్రామాలకు చెందిన ప్రజలు ధర్నా చేయటంతో సుమారుగా గంటకు పైగా రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం, దుండివారిపాలెం గ్రామ పంచాయతీల పరిధిలో భారతీయ జనతాపార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలు నెలకొల్పారు. ఈ కంపెనీలకు సమీపంలో దమ్మనవారిపాలెం, తిమ్మారెడ్డిపాలెం, శ్రీరామ్‌నగర్‌, బోలాయపాలెం, దుండివారిపాలెం, బిడారుదిబ్బ గ్రామాలు ఉన్నాయి. ఈ కంపెనీలలోని రొయ్యల వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసన చుట్టు ప్రక్కల గ్రామాలకు వ్యాపించటంతో ఆగ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కంపెనీకి అతి సమీపంగా ఉన్న తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో భూగర్భ జలాలు కలుషితమై నీరు రంగు మారటంతోపాటు దుర్వాసన వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు వదులుతున్న కలుషిత నీరు తమ పంట పొలాల్లోకి వస్తున్నాయని దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని గ్రామంలోని బోరింగ్‌ పంపుల నుంచి వచ్చే నీరు కూడా తాగేందుకు పనికిరావటం లేదని ఆనీటితో స్నానం చేసినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను కలెక్టర్‌కి అర్జీ రూపంలో విన్నవించినా తమకు న్యాయం జరగలేదని గ్రామాలు వదిలి వెళ్లటమే మార్గంగా కనిపిస్తుందని తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తులు వాపోతున్నారు. తిమ్మారెడ్డిపాలెంలోని గ్రామస్తులతో పాటు దమ్మనవారిపాలెం, బోలాయపాలెం, తిమ్మారెడ్డిపాలెం, దుండివారిపాలెం, బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కొంతమంది జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తులు మహిళలు, పిల్లలతో సహా తాము పండించిన వరిపైరుతో పాటు కంపెనీలు తమ పొలాల్లోకి వదిలిన పచ్చగా మారిన కలుషిత నీటిని క్యాన్లతో తీసుకుని వచ్చి రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర, చందోలు ఎస్‌ఐ ఎంవి శివకుమార్‌ యాదవ్‌, బాపట్ల రూరల్‌ సీఐ హరికృష్ణ, సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళన చేస్తున్న వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ధర్నా విరమించేందుకు గ్రామస్తులు అంగీకరించలేదు.

కలెక్టర్‌ దృష్టికి సమస్య తీసుకెళతాం..

తిమ్మారెడ్డిపాలెం వద్ద గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్నారని పోలీసుల ద్వారా తెలుసుకున్న తహసీల్దార్‌ షాకీర్‌ పాషా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు చెప్పిన విషయాలను విని సీఐ హరికృష్ణతో కలసి రొయ్యల కంపెనీల నుంచి పొలాలకు వస్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్‌, సీఐ గ్రామస్తులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించటం మంచిది కాదని చెప్పారు. కలెక్టర్‌ వద్దకు తీసుకువెళ్లి సమస్యను తెలియజేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సంఘటనా స్థలానికి కలెక్టర్‌ రావాలని, మా సమస్యలను ఆయన స్వయంగా చూడాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అధికారులు నచ్చచెప్పటంతో ఎట్టకేలకు ధర్నా విరమించారు.

న్యాయం చేస్తారా.. ఊరు వదిలి వెళ్లాలా? 1
1/1

న్యాయం చేస్తారా.. ఊరు వదిలి వెళ్లాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement