లాకప్‌లలో... మరణ మృదంగం | Dalit woman Gangamma dies in police custody in Kurnool district | Sakshi
Sakshi News home page

లాకప్‌లలో... మరణ మృదంగం

Jun 20 2026 4:29 AM | Updated on Jun 20 2026 5:25 AM

Dalit woman Gangamma dies in police custody in Kurnool district

కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్‌లో మృతి! 

పోలీసుల టార్చర్‌తోనే మరణం 

గుట్టుచప్పుడు కాకుండా ఖననం 

‘అనకొండ ఐపీఎస్‌’ కనుసన్నల్లోనే దారుణం 

కప్పిపుచ్చేందుకు రంగంలోకి బిగ్‌బాస్‌ 

ఓ అధికారి వీఆర్‌కు.. మరో అధికారి ఆకస్మిక బదిలీ.. సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు 

గంగమ్మ డీఎన్‌ఏ శ్యాంపిల్స్‌ను భద్రపరచాలని వినతి

సాక్షి, అమరావతి, ఆదోని:  విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్‌లో కొట్టి చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేయడం అన్నది చంద్రబాబు ప్రభుత్వం అధికారిక విధానంగా చేసుకున్నట్లుంది! అందుకే బిగ్‌బాస్‌ నుంచి రాష్ట్రంలో జిల్లాస్థాయి అధికారుల వరకూ అదే ఖాకీ మార్కు క్రౌర్యాన్ని బరితెగించి ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో ‘రెడ్‌బుక్‌’ పోలీసులు యథేచ్ఛగా సాగిస్తున్న లాకప్‌ మరణాల దారుణాలు మరిన్ని బట్టబయలవుతున్నాయి. విజయ­వాడలో సాయికృష్ణ లాకప్‌లోనే అదృశ్యం కావడం ఇప్పటికే సంచలనంగా మారగా.... క్రాంతికుమార్‌ అనే దళిత యువకుడు పోలీసుల థర్డ్‌ డిగ్రీ వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. 

కర్నూలు జిల్లాలో కూడా పోలీసులు ఓ దళిత మహిళను విచారణ పేరుతో పాశవికంగా కొట్టి చంపేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అమానుష కాండపై బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో తమ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు బిగ్‌బాస్‌ నేతృత్వంలో పోలీసులు కొత్త కుట్రకు తెర తీస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

దళిత మహిళపై పోలీసుల క్రౌర్యం
కర్నూలు జిల్లా కౌతాళం గ్రామానికి చెందిన గంగమ్మ అనే దళిత మహిళను పోలీసులు ఓ కేసులో తమదైన శైలిలో విచారించారు. ప్రత్యేకంగా ఏర్పడిన సిట్‌ అధికారులు విచారణ సమయంలో విచక్షణారహి­తంగా కొట్టడంతో ఆమె అచేతనంగా పడిపోయారు. ఆమె చనిపోయిందని గ్రహించడంతో రాయల­సీమలో రెడ్‌­బుక్‌ రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవ­హరి­స్తున్న అవి­నీతి అనకొండ ఐపీఎస్‌ అధికారిని సంప్రదించారు. ఆయన సూచనలతో పక్కాగా కథ నడిపించారు. అందుకు గంగమ్మ కుమార్తెను తమ­దైన శైలిలో బెదిరించి అనుకూలంగా మలచుకు­న్నారు.

గంగమ్మ కాలుజారి పడిపోయి చనిపోయిందని ఆమె కుమార్తె నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. కాలు జారి­ప­డిపోతే పోలీసులు ఆమె కుమార్తె నుంచి లిఖితపూ­ర్వకంగా వాంగ్మూలం తీసుకోవాల్సిన అవసరం ఏముందీ అంటే... లాకప్‌ మరణాన్ని కప్పిపుచ్చేందు­కు ముందు జాగ్రత్త చర్యగానే పోలీసులు ఈ ఎత్తుగడ వేశారన్నది స్పష్టమవుతోంది. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య గంగమ్మ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, దళిత సంఘాల ఆదోళనతో ప్రభుత్వం తూతూ మంత్రంగా స్పందించింది.

హైకోర్టులో పిటిషన్‌..
గంగమ్మను ఖననం చేశారనే విష­యాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. గంగమ్మ డీఎన్‌ఏ శాంపిల్స్‌ను భద్రపరిచి సమగ్రంగా దర్యాప్తు చేయించాలని పూర్తి వివరాలతో న్యాయ­స్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. దాంతో న్యాయ­స్థానాన్ని తప్పు­దారి పట్టించే ఎత్తుగడలపై బిగ్‌­బాస్, రాయలసీమ అన­కొండ ఐపీఎస్‌ తీవ్రంగా తర్జనభర్జన పడుతు­న్నట్టు సమాచారం. గంగమ్మ లాకప్‌ మర­ణం ఉదంతంలో తదు­పరి పరిణామాలు ఆసక్తి­కరంగా మారాయి. మరోవైపు గంగమ్మతో పాటు కస్టడీ­లోకి తీసుకున్న 47 ఏళ్ల బ్యాగారి దర్గప్ప ఖాకీ దెబ్బలకు ప్రాణా­పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. 

మర్డర్‌ కేసు నమోదు చేయాలి..
కస్టోడియల్‌ టార్చర్‌లో లాకప్‌ డెత్‌ జరిగితే వెంటనే సదరు పోలీసు అధికారులపై మర్డర్‌ కేసు బుక్‌ చేయాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతోంది. దొంగతనం చేశాడన్న ఆరోపణలు వస్తే ముందుగా కేసు రిజిస్టర్‌ చేస్తున్నారా లేదా? విచారణలో దొంగతనం చేయలేదని తేలితే వదిలేస్తారు. అదేవిధంగా కస్టోడియల్‌ టార్చర్‌లో లాకప్‌ డెత్‌ జరిగితే తక్షణమే పోలీసులపై కేసు రిజిస్టర్‌ చేయాల్సిందే. 

సిట్‌ వేస్తాం, ఐపీఎస్‌ అధికారితో విచారణ జరిపిస్తామంటే కుదరదు. ఆర్టికల్‌ 21 ఏం చెబుతుందంటే.. ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా? అన్నది కోర్టు రుజువు చేస్తుంది. అంతేగానీ స్టేషన్లలో పోలీసులు కాదు. రాజస్థాన్‌లో ఒక ఎంపీని చంపితే 30 ఏళ్ల తర్వాత 15 మంది పోలీసు ఆఫీసర్లు జైలుకెళ్లారు. వీరిలో రిటైర్‌ అయిన వారూ ఉన్నారు. ఒకాయనకు 82 ఏళ్లు. అయినా జైలుకు పోక తప్పలేదు.– డాక్టర్‌ బి.పురుషోత్తమరెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement