సై'డర్'..! | Cyber crimes in Srikakulam district | Sakshi
Sakshi News home page

సై'డర్'..!

Aug 11 2025 6:02 AM | Updated on Aug 11 2025 6:03 AM

Cyber crimes in Srikakulam district

రెచ్చిపోతున్న సైబరాసులు 

రూ.కోట్లలో బాధితులకు టోకరా 

పరువు పేరుతో ఫిర్యాదు చేసేందుకు బాధితుల వెనకడుగు

మన ఇంట్లో బంగారం పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మన కుటుంబంపై ఎవరైనా దాడికి పాల్పడినా.. ఆడపిల్లలను ఏడిపించినా.. ఎవరైనా మోసగించినా వెంటనే స్పందిస్తాం. అంతేవేగంగా పోలీసులు సైతం విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రూ.కోట్లలో మోసాలకు పాల్పడే కంటికి కనిపించని, పరిచయం లేని సైబర్‌ మోసగాళ్లపై పరువు అనే సమస్యకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం అంతా వెనకడుగు వేస్తారు.

ఎందుకంటే టెక్నాలజీ పరంగా, సామాజిక మాధ్యమాల పరంగా కొన్ని బలహీనతలకు లోబడి చేసే తప్పులు బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆగిపోతున్నారు. కుటుంబంలో తెలిస్తే బాధపడతారని రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు.  – శ్రీకాకుళం క్రైమ్‌

గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్‌ చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన సైబరాసురులు హనీట్రాప్, డిజిటల్‌ అరెస్టు, ట్రేడింగ్, పార్ట్‌టైం జాబ్‌ల పేరిట రెచ్చిపోతున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులతో సుమారు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయని, స్టేషన్‌ మెట్లెక్కని బాధితులు మరింతమంది ఉండొచ్చని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మోసపోయినవారిలో ఉన్నత ఉద్యోగ వర్గాలే ఉండడం విశేషం.  

హనీ ట్రాప్‌లో పడి.. 
జిల్లాకేంద్రం సమీపంలోని సంపన్న వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల ఒక అమ్మాయి వాట్సాప్‌లో హాయ్‌ అని మెసేజ్‌ పెట్టింది. ప్రొఫైల్‌ పిక్‌లో అమ్మాయి ఫొటో ఉండడంతో ఆకర్షితమైన సదరు వ్యక్తి వెంటనే హాయ్‌ అని రిప్లయ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత నిత్యం చాటింగ్‌ చేయడం రివాజైంది. కొన్నాళ్లకు వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడడం.. వీడియో కాల్స్‌ చేయడం ఆరంభించింది. అలా ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి వీడియో కాల్స్‌లో న్యూడ్‌ కాల్స్‌ చేయడం ప్రారంభించింది. 

కొద్దిరోజులు తానే న్యూడ్‌గా కనిపించి ఆ తర్వాత సదరు వ్యక్తిని సైతం న్యూడ్‌గా కనిపించాలని కోరిక కోరడంతో, అతడు కూడా నగ్నంగా మాట్లాడడం ఆరంభించాడు. దీంతో ఆ వ్యక్తి నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్‌ను రికార్డింగ్‌ చేసిన ఆ యువతి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఆరంభించింది.

ఆమె తరపున మరికొంతమంది సైతం వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందేమోనని భయపడి, చేసేదేమీలేక వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు దఫదఫాలుగా రూ.28 లక్షల వరకు పంపించేశాడు. అయినప్పటికీ డబ్బుల కోసం పీడిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

డిజిటల్‌ అరెస్టు పేరిట..  
విశాఖపట్నంలోని ఒక అకౌంటింగ్‌ సెక్షన్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న శ్రీకాకుళం నగరవాసి డిజిటల్‌ అరెస్టు పేరిట రూ.11 లక్షలను సైబర్‌ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. మీ పేరిట కొరియర్‌లో డ్రగ్స్‌ ప్యాకెట్‌ వచ్చిందని.. మీ ఆధార్‌ లింక్‌ నంబర్‌తో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ, కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేసే వీలుందని ఒక వ్యక్తి బెదిరించడంతో నిజమేనని నమ్మాడు. దీనినుంచి బయటపడాలంటే ముందుగా రూ.30 వేలు తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఉద్యోగి వేశాడు. 

మళ్లీ ఆ వ్యక్తి ఫోన్‌ చేసి పై అధికారులను మేనేజ్‌ చేయడం కుదరడం లేదని.. వారే మీకు లైన్‌లోకి రావొచ్చని మెల్లగా జారుకున్నాడు. కొన్ని గంటల్లోనే పోలీసు సెటప్‌తో ఉన్న ఓ రూంలో యూనిఫాంతో ఓ వ్యక్తి వీడియో కాల్‌లో ప్రత్యక్షమై తాను ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్‌ డైరెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. మేం నిన్ను నమ్మాలంటే మీ బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌ నంబర్, ఫోన్‌ నంబర్లు వెరిఫికేషన్‌ చేయాలన్నాడు. వాటి ఆధారంగా ఇటీవల జరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీలు పరిశీలించాలని.. కొంత అమౌంట్‌ను కూడా వెరిఫికేషన్‌లో భాగంగా తీయాల్సి వస్తుందని చెప్పాడు. 

అందులో జెన్యూనిటీ ఉంటే తిరిగి మీ ఖాతాలో అమౌంట్‌ వేయడం జరుగుతుందని చెప్పడంతో సదరు ఉద్యోగి ఓకే చేశాడు. అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేయడంతో పాటు ఓటీపీలు చెప్పడంతో రూ.11 లక్షలను కొట్టేశారు. దీంతో తాను మోసానికి గురయ్యానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జేఈ రూ.3 లక్షలు, నగరానికి చెందిన ఓ బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నారంటూ వీరిని సైబరాసురులు అధికారుల పేరిట బెదిరించడం విశేషం.

పార్ట్‌టైం జాబ్‌ ఫ్రాడ్స్‌.. 
వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఇంట్లోనే ఉంటూ పార్ట్‌టైం జాబ్‌ చేసే వీలుందని చెప్పడంతో నగరంలో నలుగురు చిరుద్యోగులు ఈ ఉచ్చులో పడ్డారు. ముందుగా వారు క్రియేట్‌ చేసిన గ్రూపుల్లో మెంబర్లుగా చేరారు. మొదటి టాస్‌్కలో రూ.5 వేలుకు రూ.1000లు అదనంగా రూ.6 వేలు, రెండో టాస్‌్కలో రూ.10 వేలకు రూ.2 వేలు అదనంగా రూ.12 వేలు వేయడంతో విత్‌డ్రా చేసుకున్నారు. 

అనంతరం అత్యాశకు పోయి తర్వాత టాస్క్‌ల్లో రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ.2 లక్షలకు అదనపు సొమ్ము ఖాతాల్లో ఉన్న ఆప్షన్‌లో చూపించినా విత్‌డ్రా చేయడానికి వీలుకాకపోవడం.. ఆ తర్వాత అవతలివాళ్లు వీరి నంబర్లు బ్లాక్‌ చేయడంతో మోసపోయామని గ్రహించారు.   

పోలీసులకు ఆసక్తి ఉన్నా..  
పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నా మోసం చేసే సైబర్‌ కేటుగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల్లో సైతం ఉండడం.. తెలియని ప్రాంతాల్లో రిస్క్‌ చేసి పట్టుకోవడానికి వెళ్లే ఆసక్తి ఉన్నా.. రాను పోను ఖర్చులు, వసతి ఖర్చులకు చేతి చమురు తగులుతుండటం.. ఆపై ఎక్కువ రోజుల సమయం వెచ్చించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు. అలా కేసుల్లో అధికశాతం పెండింగ్‌ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన ప్రభుత్వాలు కాస్తా చొరవ తీసుకుని ఆర్థికంగా చేయూతనిస్తే కేసుల ఛేదన సులభమేనంటూ పోలీసులు చెబుతున్నారు. 

ఉపాధ్యాయుడికి టోకరా 
నగర పరిసరాల్లో ఉండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఓ నేరం చేశాడని.. సీబీఐ, ఈడీ విభాగాల అధికారులు అరెస్టు చేసే వీలుందని సైబర్‌ నేరగాళ్లు భయపెట్టారు. దానికి తగ్గ ఆధారాలు తమ వద్దనున్నాయని చెబుతూనే ఫేక్‌ వివరాలు వాట్సాప్‌లో పంపడంతో ఉపా«ధ్యాయుడు ఖంగుతిన్నాడు. మీ అబ్బాయి నేరం నుంచి బయటపడి, విదేశాల నుంచి రావాలనుకుంటే అధికారులకు అమౌంట్‌ కట్టాల్సి ఉంటుందన్నారు.

పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుందని అనడంతో చేసేదేమీలేక రూ.35 లక్షలు వారు చెప్పిన వివిధ ఖాతాల్లోకి పంపించాడు. ఎక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనని గంట గంటకు ఉపాధ్యాయునికి వాట్సాప్‌ వీడియో కాల్‌ నేరస్తులు చేసేవారు. తర్వాత వాళ్ల నంబర్లకు ఫోన్‌ కాకపోవడంతో బాధిత ఉపాధ్యాయుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.  

క్షణాల్లో మోసాన్ని గ్రహించాలి  
సహజంగా జరిగే చోరీలు.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న సైబర్‌ మోసాలను పరిశీలిస్తే 1:10 నిష్పత్తిలో నగదు మోసానికి గురవుతోంది. సైబర్‌ నేరగాడు బాధితుడి ఆర్థిక స్థితిని చూడడు. అత్యాశనే చూస్తాడు. వారు చేసే మోసాన్ని క్షణాల్లో మనం గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని పూడ్చవచ్చు. ఈవిధంగానే ఇటీవల డిజిటల్‌ అరెస్టు వలలో పడి రూ.13.5 లక్షల పోగొట్టుకున్న జెమ్స్‌ వైద్యురాలి కేసు ఛేదించాం. కోచిగూడ్, మైసూర్‌ వెళ్లి నిందితులను పట్టుకున్నాం. రాష్ట్రంలో రోజుకి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు బాధితులు నష్టపోతున్నారు. – సీహెచ్‌ పైడపునాయుడు, సీఐ, శ్రీకాకుళం రూరల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement